బర్త్‌డే : వినాయక్‌ ఫ్యాన్స్‌కి మళ్లీ భంగపాటు

వినాయక్‌ సైతం ఈ బర్త్‌డే సందర్భంగా మీడియా ముందుకు వచ్చి తన తదుపరి సినిమాల గురించి మాట్లాడింది లేదు. వినాయక్‌తో సినిమా అంటే యంగ్‌ హీరోలు ఇప్పటికీ రెడీ అంటారు.

Update: 2026-10-10 06:51 GMT

టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో వివి వినాయక్‌ మార్క్‌ సినిమాలను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. ఆయన సినిమాల మార్క్‌ యాక్షన్‌ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పటికీ చాలా మంది ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆది, చెన్నకేశవ రెడ్డి, కృష్ణ సినిమాల తరహా సినిమాల కోసం ఇప్పటికీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు ప్రేక్షకులు టీవీకి అతుక్కు పోతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇండిస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా పాతిక ఏళ్లు అవుతున్న వినాయక్‌ చేసిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఆయన దర్శకత్వంలో గడచిన పదేళ్లలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా సూపర్‌ హిట్ అయినా ఆ విజయం తాలూకు ప్రభావం వినాయక్‌ ఆస్వాదించలేక పోయాడు. పెద్దగా ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు.

మెగా హీరోతో వినాయక్‌ మూవీ...

వినాయక్‌ 2018లో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో 'ఇంటిలిజెంట్‌' సినిమాను తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తెలుగులో వినాయక్ నుంచి సినిమా రాలేదు. దాదాపుగా ఎనిమిది ఏళ్లుగా ఆయన అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కూడా వినాయక్ నుంచి స్పందన లేదు. నిన్న వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఒక సినిమా ప్రకటన ఉంటుందనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వినాయక్‌ ఒక స్టార్‌ హీరోకు చెప్పిన కథ ఓకే కావడంతో, నిర్మాత బుజ్జి ఆ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడని, ఆ సినిమాను బర్త్‌ డే సందర్భంగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఎప్పటిలాగే వినాయక్‌ అభిమానులకు ఈ బర్త్‌డే సందర్భంగా కూడా భంగపాటు తప్పలేదు. వినాయక్‌ కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటన, ప్రచారం బయటకు రాలేదు.

వెంకటేష్‌ తో వినాయక్‌ కొత్త సినిమా...

వినాయక్‌ సైతం ఈ బర్త్‌డే సందర్భంగా మీడియా ముందుకు వచ్చి తన తదుపరి సినిమాల గురించి మాట్లాడింది లేదు. వినాయక్‌తో సినిమా అంటే యంగ్‌ హీరోలు ఇప్పటికీ రెడీ అంటారు. ఆయన గతంలో చేసిన సినిమాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటి దిగ్గజ దర్శకుడితో సినిమాను చేసే అవకాశం వస్తే యంగ్ హీరోలు కచ్చితంగా వదులుకోరు. కానీ వినాయక్‌ మాత్రం తాను పెద్ద హీరోలతో మాత్రమే సినిమాను చేయాలి అనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ మధ్య చిరంజీవితో ఒక సినిమా గురించి చర్చలు జరిగాయి, మరో వైపు నాగార్జునతోనూ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఫైనల్‌ కాలేదు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు...

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్ద హీరోలతో సినిమా అంటే అంత ఈజీ కాదు. కొత్త దర్శకులతోనే ఎక్కువగా స్టార్‌ హీరోల సినిమాలు చేస్తున్నారు. కొత్త ట్యాలెంట్‌ ను ఎంకరేజ్ చేయడంతో పాటు, కొత్త వారు అయితేనే ఈ జెనరేషన్‌ అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు చేస్తారు అనే ఉద్దేశంతో వారితో సినిమాలు చేస్తున్నారు. వినాయక్‌ వంటి దర్శకులతో స్టార్‌ హీరోల సినిమాలు తక్కువగా వస్తున్నాయి. అందుకే వినాయక్‌ కొత్త హీరోలతో సినిమాలకు ప్రయత్నాలు చేస్తే ఇప్పటికి ఎన్నో సినిమాలు చేసేవాడు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం సినిమాలు చేయడం లేదు. ఇక మీదట వినాయక్‌ నుంచి సినిమాలు వస్తాయా అంటే అనుమానమే అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. వినాయక్‌ వద్ద ఇప్పటికే రెడీగా ఉన్న స్క్రిప్ట్‌లతో వచ్చే ఏడాదిలో అయినా సినిమా మొదలు పెట్టాలని కొందరు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News