మెగాస్టార్ చిరంజీవికి జాతీయ అవార్డ్‌.. తెర‌వెన‌క కుట్ర చేసింది ఎవ‌రో తెలుసా?

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వివక్షను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, జ్యూరీ వైఖరిని గట్టిగా నిలదీశారు.

Update: 2026-10-10 03:37 GMT

తెలుగు చిత్రపరిశ్రమ దశాబ్దాల తరబడి ఎందరో నటదిగ్గజాలను, మహానుభావులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండ్స్ నుంచి మొదలుకొని కళాత్మక పంథాలో.. కమర్షియల్ వినోదంలో తమ అసాధారణ నటనా వైదుష్యాన్ని ప్రదర్శించిన ఎందరో స్టార్లు టాలీవుడ్‌లో వెలిగారు. ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఐదు దశాబ్దాలకు పైగా మనుగడ సాగించిన చ‌రిత్ర‌ను క‌లిగి ఉన్నా.. ఎంద‌రో జ‌ర్న‌లిస్టులు ఏలిన ఈ ప్ర‌పంచంలో దాదాపు తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్రలో తెలుగు నటుడికి `జాతీయ ఉత్తమ నటుడు` పురస్కారం దక్కకపోవడం గమనార్హం. దిల్లీలోని ప్రసార భారతి లేదా జాతీయ అవార్డుల జ్యూరీ కమిటీలు తెలుగు స్టార్ల‌ నటనను గుర్తించడంలో దారుణమైన వివక్ష చూపించాయి. బహుశా జాతీయ స్థాయిలో ఇంతగా అలక్ష్యానికి గురైన పరిశ్రమ మరొకటి లేదనే చెప్పాలి.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వివక్షను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, జ్యూరీ వైఖరిని గట్టిగా నిలదీశారు. అలా సుదీర్ఘ పోరాటాల తర్వాత కమర్షియల్ సినిమా స్థాయిని అసాధార‌ణంగా పెంచిన‌ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను `పుష్ప` చిత్రానికి గాను `జాతీయ ఉత్తమ నటుడు` అవార్డు వరించింది. అయితే దశాబ్దాల క్రితమే కమర్షియల్ సినిమాలను అసాధారణ విజయపథంలో నడిపిస్తూనే.. ఖైదీ, పున్న‌మినాగు, రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు వంటి విలక్షణ చిత్రాలలో నట విశ్వరూపం ప్రదర్శించిన చిరంజీవి నటన జ్యూరీ కంటికి కనిపించకపోవడం టాలీవుడ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదనను నింపింది.

బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సాధించి టాలీవుడ్‌లో తిరుగులేని కథానాయకుడిగా నిలిచిన చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి `పద్మ భూషణ్`, `పద్మ విభూషణ్` లాంటి అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. కానీ నటుడిగా ఆయనకు ఒక్క జాతీయ అవార్డు కూడా దక్కకపోవడం వెనుక పెద్ద రాజకీయమే ఉందనే విషయం అభిమానుల్ని వేద‌న‌కు గురి చేస్తూనే ఉంది. లెజెండరీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు లాంటి కళాత్మక చిత్రాలను నిర్మించారు. ఆ అనుబంధంతోనే ఏడిద నాగేశ్వర రావు తనయుడు ఏడిద శ్రీరామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి జాతీయ అవార్డు మిస్ కావడంపై సంచలన విషయాలను బయటపెట్టారు.

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన `ఆపద్బాంధవుడు` చిత్రానికి గాను ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దాదాపు ఖాయమైందని ముందుగానే తమకు సమాచారం అందిందని ఏడిద శ్రీరామ్ తెలిపారు. అయితే ఆఖరి నిమిషంలో జ్యూరీ సభ్యులు చేసిన అంతర్గత రాజకీయాల వల్ల చిరంజీవికి రావాల్సిన పురస్కారం చేజారిపోయింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రాజకీయం చేసింది ఉత్తరాది వాళ్లు కాదని.. స్వయంగా దక్షిణాదికి చెందినవారేనని శ్రీరామ్ వ్యాఖ్యానించారు. నార్త్ పరిశ్రమలో తమకు కావలసిన వారికి ఆ అవార్డు దక్కేలా చేయడం కోసం తమిళ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు తెరవెనుక చక్రం తిప్పి చిరంజీవి పేరును పక్కకు తప్పించారని ఆయన ఆరోపించారు.

ఏదేమైనా టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ ఉన్నా.. కొన్ని తెరవెనుక రాజకీయ సమీకరణాల కారణంగా మెగాస్టార్ చిరంజీవికి జాతీయ అవార్డు దక్కకుండా పోయిందనే విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారా మరొకసారి తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే చిరంజీవి లాంటి అసాధార‌ణ నటుడికి ప్రత్యేకంగా ఒక జాతీయ అవార్డు సర్టిఫికెట్ అవసరం లేదని.. ఆయన ఇప్పటికే కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. దేశ అత్యున్నత పురస్కారాలు పొందిన చిరంజీవికి ప్రేక్షకుల ఆదరాభిమానాలే అందరికంటే పెద్ద అవార్డని ఆ ఇంట‌ర్వ్యూ స్పష్టం చేస్తోంది. ఆస‌క్తిక‌రంగా త‌న‌వారే (తంబీలు) కాళ్లు ప‌ట్టి గుంజిన వైనం కూడా ఈ ఇంట‌ర్వ్యూ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ద‌క్షిణాదిపై ఉత్త‌రాది వివ‌క్ష ఒక వైపు.. సొంత సోద‌ర ప‌రిశ్ర‌మ రాజ‌కీయాలు మ‌రోవైపు చిరంజీవికి జాతీయ అవార్డ్ రాకుండా చేసాయనేది విస్ప‌ష్ఠం.

Tags:    

Similar News