తెలుగు, కన్నడ దగ్గరగా ఉన్నా అభిరుచి చాలా దూరం.. ఇదే సాక్ష్యం
కన్నడంలో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో సురేష్ కొండేటి డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
తెలుగు భాష, కన్నడ భాష లిపి చూడ్డానికి కాస్త దగ్గరగా ఉంటాయి. రెండు భాషల అక్షరాల మధ్య కొంత పోలిక ఉంటుంది. మలయాళం, తమిళ్ లిపితో పోల్చితే కచ్చితంగా కన్నడ లిపి తెలుగు లిపికి దగ్గరగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాగే పలకడంలోనూ అలాగే ఉంటుంది. కన్నడ భాషను తెలుగు వారు, తెలుగు భాషను కన్నడ వారు కాస్త అటు ఇటుగా అర్థం చేసుకోగలరు. అందుకే మొదటి నుంచి కన్నడ, తెలుగు వారి మధ్య కాస్త ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉంటాయనే టాక్ ఉంది. అయితే సినిమాల మార్పిడి విషయంలో మాత్రం చాలా దూరం ఉంటుంది. కన్నడంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి, కొన్ని డబ్ అయ్యాయి. కానీ ఎక్కువ శాతం తీవ్రమైన నిరాశను మిగిల్చాయి. అక్కడ సెన్షేషల్ హిట్‌గా నిలిచిన సినిమాలు సైతం తెలుగులో మినిమం హిట్ కాదు కదా, డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే.
కేజీఎఫ్, కాంతార సినిమాల తర్వాత...
కాంతార, కేజీఎఫ్ వంటి కొన్ని సినిమాలు మినహా ఎక్కువ శాతం కన్నడ సినిమాలు తెలుగులో మినిమం బజ్ క్రియేట్ చేయలేక పోయాయి. బజ్ లేకుండా విడుదల చేసినా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో తెలుగులో కన్నడ సినిమాలను డబ్ చేయడం అనేది పెద్ద సాహసంగా మారింది. తాజాగా కన్నడ సూపర్ హిట్ మూవీ 'ప్రేమద ఊరలీ' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకు కన్నడ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.50 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. సినిమాను ఇంకాస్త బెటర్‌గా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా రూ.100 కోట్ల మార్క్‌ను చేరి ఉండేదని, మొదటి వారంలో సినిమా జనాల్లోకి తీసుకు వెళ్లడం లో మేకర్స్ విఫలం అయ్యారు. పబ్లిక్ మౌత్ టాక్ కారణంగానే సినిమా అక్కడ జనాల్లోకి వెళ్లి భారీ వసూళ్లు నమోదు అయినట్లుగా బాక్సాఫీస్ రిపోర్ట్.
ప్రేమనే ఊరిలో సినిమాతో...
కన్నడంలో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో సురేష్ కొండేటి డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కన్నడ వర్షన్ విడుదల అయిన సమయంలో తెలుగులో ది ప్యారడైజ్ మూవీ విడుదల అయింది. కనుక ఆ సమయంలో రిలీజ్ వాయిదా వేసుకుని, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. సినిమాకు మంచి పబ్లిసిటీ చేసిన సురేష్ కొండేటి సాధ్యం అయినంత వరకు సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. భారీ పోటీ మధ్య 'ప్రేమనే ఊరిలో' అనే టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాకు ఒక వర్గం నుంచి బాగానే ఉందనే టాక్ వచ్చినప్పటికీ ఎక్కువ శాతం సినిమాను పట్టించుకోవడం లేదు. మేజర్ సిటీల్లో సినిమాకు కొంత మేరకు వసూళ్లు వస్తున్నా, జిల్లాల స్థాయిలో సినిమాకు వసూళ్లు పెద్దగా నమోదు కావడం లేదట.
తెలుగు వర్సెస్ కన్నడ సినిమాలు...
ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరి, సంచలన విజయం సాధించిన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మినిమం ఓపెనింగ్స్ దక్కక పోవడం విడ్డూరంగా ఉంది. సినిమా వసూళ్లు ఇప్పటికే డ్రాప్ అయ్యాయి. రెండో వారంలో సినిమాకు వసూళ్లు నమోదు అవుతాయి అనే ఆశ కూడా లేదని బయ్యర్లు అంటున్నారు. కన్నడంలో అంతటి విజయం సాధించిన సినిమా తెలుగులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం చూస్తుంటే మరోసారి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి కన్నడ ప్రేక్షకుల అభిరుచికి చాలా వ్యత్యాసం ఉంటుందని, భాషలు కాస్త దగ్గరగా ఉన్నా అభిరుచి చాలా దూరంగా ఉండటం వల్లే సినిమాల ఫలితాలు ఇలా నమోదు అవుతున్నాయి అనేది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో ముందు ముందు చిన్న కన్నడ సినిమాల డబ్బింగ్ కు దూరంగా ఉండటం మంచిది అని నిర్మాతలు భావిస్తున్నారు.