మూవీ రివ్యూ : రంభ ఊర్వశి మేనక
సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమాతో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు అల్లరి నరేష్.
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ రివ్యూ
నటీనటులు: అల్లరి నరేష్- సురభి- వీకే నరేష్- శ్రీనివాసరెడ్డి- వెన్నెల కిషోర్- రాశి సింగ్- విష్ణు ప్రియ- ప్రీషా సింగ్- తారక్ పొన్నప్ప- రచ్చ రవి-హరితేజ తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
నిర్మాతలు: రాజేష్ దండ- నిమ్మకాయల ప్రసాద్
రచన-దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమాతో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు అల్లరి నరేష్. సీరియస్ సినిమాలు కొన్ని తేడా కొట్టాక ఒకప్పుడు తనకు అనేక విజయాలందించిన కామెడీ జానర్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు నరేష్. ఈ కోవలో చేసిన సినిమానే.. రంభ ఊర్వశి మేనక. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అల్లరోడు కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా? చూద్దాం పదండి.
కథ:
సూరి (అల్లరి నరేష్) రాజమండ్రికి దగ్గర్లో ఉండే పెద్ద బాణాపురం అనే ఊరికి చెందిన కుర్రాడు. అతడికి పూర్వీకుల నుంచి వచ్చిన ‘రంభ ఊర్వశి మేనక’ అనే డ్రామా కంపెనీ ఉంటుంది. ఆ పూర్వీకుల నుంచే అతడికి ఒక మహిమలున్న పుస్తకం అందుతుంది. దాని మీద ముగ్గును సరిగ్గా తీస్తే రంభ-ఊర్వశి-మేనక ప్రత్యక్షమై వరాలు ఇస్తారని చెప్పిన బాబాయి మాటను నమ్మి ఏ పనీ చేయకుండా.. ఆ ముగ్గు గీసే ప్రయత్నాల్లో ఉంటాడు సూరి. అనేక ప్రయత్నాల తర్వాత అతను కోరుకున్నట్లే రంభ- ఊర్వశి- మేనక ప్రత్యక్షమవుతారు కానీ.. వారి శక్తులను మాత్రం కోల్పోతారు. అదే సమయంలో సూరి తల్లి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలవగా..శక్తి హీనులైన రంభ.. ఊర్వశి.. మేనకలను నెల రోజుల పాటు జాగ్రత్తగా కాపాడితే ఆ తర్వాత వారి అనుగ్రంతో తన సమస్యలు తీర్చుకునే అవకాశముంటుందని సూరికి తెలుస్తుంది. ఈ స్థితిలో అతనేం చేశాడు.. రంభ-ఊర్వశి-మేనకలను నెల రోజుల పాటు ఎలా మేనేజ్ చేశాడు.. వారి వల్ల అతను పడ్డ పాట్లేంటి.. చివరికి తన సమస్యలన్నీ తీరాయా లేదా అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
‘రంభ ఊర్వశి మేనక’లో దివి నుంచి భువికి దిగి వచ్చిన ముగ్గురు దేవతలు తమ మహిమల్ని కోల్పోయిన పరిస్థితిలో హీరోకు ఎలా సాయపడదామా అని ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తే.. తమ దగ్గర మహిమలు లేకపోయినా నృత్య ప్రతిభ ఉంది కదా అని హీరో డ్రామా కంపెనీ కోసం డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతారు. మరి ఈ ముగ్గురూ ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తారా అని చూస్తే.. స్టేజ్ మీద వాళ్లు చేసేదేమో ఫక్తు రికార్డింగ్ డ్యాన్స్. దేవతల్ని ఐటెం గర్ల్స్ లాగా మార్చి అలాంటి కుప్పిగెంతులు వేయించాలన్న ఆలోచనే విడ్డూరం అంటే.. వీళ్ల గెంతుల తాలూకు వీడియో యూట్యూబ్ లో తెగ వైరల్ అయిపోయి హీరో అకౌంట్లోకి లక్షలు లక్షలు వచ్చి పడిపోవడం ఇంకా విచిత్రం. ఒకవైపేమో ఓ పెద్ద ఆడియో కంపెనీ అగ్రిమెంట్ ఆఫర్ చేస్తుంది. ఇంకోవైపేమో ఒక పేరున్న టీవీ ఛానెల్ ఒక పాపులర్ షోలో ఛాన్సిచ్చేస్తుంది. కామెడీ సినిమాల్లో లాజిక్కులు వెతక్కూడదన్నది నిజమే అయినా.. 2026లో ఇలాంటి సీన్లు పెట్టి ప్రేక్షకులను ఎలా మెప్పించగలం అనుకున్నారన్నది ప్రశ్నార్థకం. ‘రంభ ఊర్వశి మేనక’ ఎంత సిల్లీగా నడుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వెటకారపు సీన్లు సినిమాలో కోకొల్లలు.
అల్లరి నరేష్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మాట వాస్తవం. అతడికో మంచి హిట్ పడాలని అందరూ కోరుకుంటారన్నది నిజం. కానీ అతడి కామెడీ సినిమాలు ప్రేక్షకులకు మరీ మొహం మొత్తేయడం వల్లే అతను ఆ జానర్ వదిలేసి సీరియస్ సినిమాల వైపు మళ్లాడన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకసారి కామెడీ ఇమేజ్ పక్కన పెట్టి సీరియస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాక అతణ్ని చూసే దృష్టికోణం మారిపోయింది. మళ్లీ ఇప్పుడు అతను కామెడీ ట్రై చేస్తున్నా ముందులా నవ్వులు పండట్లేదని ‘ఆ ఒక్కటీ అడక్కు’తోనే రుజువైంది. ఒకవేళ కామెడీ ట్రై చేసినా.. ఇప్పటి ట్రెండుకు తగ్గ కథను ఎంచుకుని డిఫరెంటుగా ఏదైనా ప్రయత్నించాలి కానీ.. దశాబ్దాల ముందు రావాల్సిన కథను తీసుకుని ఆ కాలం నాటి కామెడీనే ట్రై చేస్తే ఇప్పటి ప్రేక్షకులు ఏం కనెక్ట్ అవుతారు? హీరో డిమాండు మేరకు దేవుళ్లు దిగి వచ్చి అతడితో పాటు ప్రయాణం సాగిస్తూ.. ఈ క్రమంలో అతడిలో పరివర్తన కలిగించడం అన్నది బాగా అరిగిపోయిన ఫార్ములా. ఇలాంటి కథను ఎంచుకోవడం తప్పు కాదు కానీ.. ట్రీట్మెంట్ అయినా కొత్తగా ఉండేలా చూసుకోవాల్సింది. క్రేజీ సీన్లు రాసుకుని.. కామెడీ పండించే ప్రయత్నం చేయాల్సింది. కానీ చంద్రమోహన్ చింతాడ కథ మాత్రమే కాదు.. నరేషన్ కూడా పాత చింతకాయ పచ్చడి స్టయిల్లోనే సాగింది. ఎప్పుడో ‘యమలీల’ సినిమాలో వాడేసిన ‘‘మానవా మానవా’’ అంటే.. ‘‘మానను గాక మానను’’ అనే డైలాగ్.. ‘‘హతవిధీ’’ అంటే.. ‘‘ఇది ఆ వీధి కాదు’’ లాంటి సంభాషణ.. ఇలాంటి పంచులతో ఈ తరం ప్రేక్షకులను మెప్పించగలం అనుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
‘రంభ ఊర్వశి మేనక’లో అస్సలు కామెడీ పండలేదని కాదు. సీనియర్ నరేష్ పాత్రతో అక్కడక్కడా కొంత నవ్వించగలిగారు. ముఖ్యంగా సెకండాఫ్ లో రంభ ఊర్వశి మేనకల సంగతేంటో తేల్చడానికి ఊరి జనం అంతా వచ్చినపుడు.. వచ్చే ఒక ఎపిసోడ్లో కామెడీ వర్కవుట్ అయింది. కానీ ఇలాంటి ఒకటీ అరా సన్నివేశాలతో ప్రేక్షకుడు సంతృప్తి చెందలేడు. నాన్ స్టాప్ నవ్వులుంటేనే కామెడీ సినిమా క్లిక్ అవుతుంది. కానీ ‘రంభ ఊర్వశి మేనక’లో ఓల్డ్ ట్రీట్మెంట్ వల్ల చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు అసహనమే కలిగిస్తాయి. ఇందులో ఇచ్చిన మెసేజ్ ఎన్నో వందల సినిమాల్లో చూసిందే. ఈ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరమా అన్నట్లుగా నడుస్తుందీ సినిమా. ఆరంభ సన్నివేశాలతోనే ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టబోతోందని అర్థమైపోతుంది. ఔట్ డేటెడ్ కామెడీ సీన్లతో బండి నడవడం కష్టమవుతుంది. ఆ రంభ ఊర్వశి మేనక వచ్చేస్తే అయినా కథనం ఊపందుకుంటుందేమో అని చూస్తాం. కానీ వాళ్లు వచ్చాక కూడా పెద్దగా కదలిక ఉండదు. దేవతలు భూమి మీదికి వచ్చాక క్రేజీ సీన్లతో ఈ కథను నడిపించే అవకాశమున్నా సరిగా ఉపయోగించుకోలేదు. బంధనాలు వేసి కట్టేసినట్లుగా తయారు చేశారు ఆ పాత్రలను. అవంత నామమాత్రంగా తయారైపోయాయి. ఇక హీరోయిన్ ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరీ బోరింగ్ గా సాగే ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కొంచెం బెటర్ అనిపించినా.. ప్రేక్షకుల్లో జోష్ అయితే తెప్పించలేకపోయింది. కామెడీ నుంచి చివర్లో కథ ఎమోషనల్ టర్న్ తీసుకున్నా అది కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. లాజిక్కులతో సంబంధం లేకుండా కన్వీనియెంట్ గా రాసుకున్న సన్నివేశాలతో చాలా సాధారణంగా ముగుస్తుంది ‘రంభ ఊర్వశి మేనక’. అల్లరి నరేష్ మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిలిం ట్రై చేశాడు కానీ.. నవ్వించడంలో మాత్రం ఫెయిలయ్యాడు.
నటీనటులు:
అల్లరి నరేష్ సూరి పాత్రను పండించడానికి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. క్యారెక్టర్ కు తగ్గట్లు నటించాడు. కానీ ఒకప్పటిలా మాత్రం తన కామెడీ పేలలేదు. గతంలో అతణ్ని చూడగానే నవ్వొచ్చేది. ఇప్పుడా ఫీలింగ్ లేకపోవడం మైనస్. ఒకప్పుడు చేసిందే ఇప్పుడు చేస్తే వర్కవుట్ కాలేదు. హీరోయిన్ సురభి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందరూ మరిచిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి సినిమాలో ‘ఔట్ డేట్’ ఫీల్ ను ఇంకా పెంచారు. రంభ- ఊర్వశి- మేనక పాత్రల్లో రాశి సింగ్- విష్ణుప్రియ- ప్రీషా సింగ్ చూడ్డానికి బాగున్నారు. ఆ పాత్రలకు సరిపోయారు. కానీ నటన పరంగా ఎవరి గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సీనియర్ నరేష్.. తన వంతుగా నవ్వించడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. కొన్నిచోట్ల కితకితలు పెట్టగలిగాడు. వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రను కొత్త కోణంలో చూపించడానికి ప్రయత్నించాడు. మొదట్లో క్రేజీగా అనిపించే ఆ పాత్ర తర్వాత విసిగిస్తుంది. శ్రీనివాసరెడ్డి.. హరితేజ.. తారక్ పొన్నప్ప.. గోపరాజు రమణ.. సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం:
‘రంభ ఊర్వశి మేనక’లో ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇంద్రలోకపు సన్నివేశాలు.. హీరో ఇంట్లో సీన్లు ఓకే కానీ.. హీరో హీరోయిన్ల చిన్నప్పటి సన్నివేశాలను చిన్న పిల్లలతో తీయకుండా ఏఐతో లాగించేయడం చిత్రంగా అనిపిస్తుంది. సాంకేతిక విభాగాల పనితీరు ఒక మోస్తరుగా అనిపిస్తుంది. చేతన్ భరద్వాజ్ పాటల్లో ఏదీ గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం ఓకే. ఇక రచయిత-దర్శకుడు చంద్రమోహన్ చింతాడ.. ఎంచుకున్న కథే చాలా పాత తరహాది కాగా.. ట్రీట్మెంట్ కూడా అందుకు తగ్గట్లే సాగింది. ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ సినిమాలు బాగా నడిచిన రోజుల్లో ఈ కథను ట్రై చేస్తే బాగుండేది. ఈ రోజుల్లో మాత్రం ఇలాంటి కథ.. ఈ తరహా నరేషన్ తో మెప్పించడం చాలా కష్టం.
చివరగా: రంభ ఊర్వశి మేనక.. మ్యాజిక్ పని చేయలేదు
రేటింగ్ - 2.25/5