'రామాయణం -1' టాకీ చిత్రీకరణ పూర్తి
నితీష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 దీపావళి 2026న థియేటర్లలోకి వస్తుంది.;
నితీష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 దీపావళి 2026న థియేటర్లలోకి వస్తుంది. పార్ట్ 2 దీపావళి 2027కి ప్లాన్ చేసారు. ముంబై ఐమ్యాక్స్ లో జూలై 3న రామాయణం టైటిల్ లోగో (ఫస్ట్ గ్లింప్స్) లాంచ్ కోసం టీమ్ ఉత్సాహంగా వేచి చూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ యష్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా పెట్టుబడులు పెడుతున్నారు. నేటితో మొదటి భాగం టాకీ చిత్రీకరణ ముగిసింది. చిత్రీకరణ చివరి రోజు తెరవెనుక ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరాముడిగా నటించిన రణబీర్ కపూర్, తారాగణం ఇతర సిబ్బంది భావోద్వేగ ప్రసంగం ఆకర్షిస్తోంది.
రణబీర్ తన కెరీర్ లో అత్యుత్తమ పాత్రలో నటిస్తున్నానని ముగింపు ఉత్సవంలో చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు తన సహతారలు సాయి పల్లవి, యష్, రవి దూబే తదితరులను రణబీర్ అభినందించారు. లక్ష్మణుడి పాత్రను పోషించిన రవి దూబే ఈ ఎమోషనల్ క్షణం రణబీర్ చెంతే నిలబడి కనిపించారు. రామ్ - లక్ష్మణ్ సోదర బంధం ఆ ఇద్దరి మధ్యా కనిపించింది. ముగింపు కార్యక్రమంలో టీమ్ కేక్ కట్ చేసిన విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్ , కైకేయిగా లారా దత్త నటించారు. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్‌లను ఆస్కార్ విన్నింగ్ స్టూడియో DNEG అందిస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్ లోను అత్యంత భారీగా విడుదల చేస్తారని సమాచారం.
చిత్ర దర్శకుడు నితేష్ తివారీ మాట్లాడుతూ-``రామాయణం అనేది మనందరికీ తెలిసిన కథ. ఇది మన సంస్కృతి విశిష్టతను ఆవిష్కరించే ప్రయత్నం. సంప్రదాయాన్ని గౌరవిస్తూ, సినిమాటిక్ బ్రిలియన్సీతో గొప్ప ప్రదర్శనను అందించడం మా లక్ష్యం. ఒక దర్శకనిర్మాతగా రామాయణ కథకు జీవం పోయడం ఒక పెద్ద బాధ్యత. ఇది మాకు గొప్ప గౌరవం. అందరికీ తెలిసిన భక్తి కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం`` అని తెలిపారు.