రామ్ పోతినేని నెక్స్ట్.. సరైన ప్లాన్ తోనే రంగంలోకి దిగుతున్నారా?
వరుస ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ లు అందుకోలేకపోయిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.;
వరుస ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ లు అందుకోలేకపోయిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా తర్వాత రామ్ పూర్తిగా కొత్త వేలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా కథ పరంగా ప్రశంసలు అందుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో రామ్ తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గతంలో మాస్, యాక్షన్, కమర్షియల్ ఫార్ములాలతో వరుస సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు కేవలం హీరోగా మాత్రమే కాకుండా కథల ఎంపిక, మేకింగ్ విషయంలో కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారట.
ఆ గ్యాప్ లో పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న రామ్.. చివరకు తనకిష్టమైన దిశలో కథను తానే సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటగా లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన జరిగినట్లు ప్రచారం సాగింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ సినిమా ముందుకు సాగలేదని, విఘ్నేశ్ తప్పుకున్నారని వినికిడి.
దీంతో ఇప్పుడు రామ్ పూర్తిగా తన సొంత ఆలోచనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన స్ట్రెంత్స్, ప్రేక్షకులు తనలో చూడాలనుకునే అంశాలు ఏంటో బాగా అర్థం చేసుకున్న రామ్.. అదే దిశగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో కథను సిద్ధం చేశారట. అంతేకాదు ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు హీరోగా మాత్రమే కనిపించిన రామ్.. ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు కూడా తమ సినిమాల మేకింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే తరహాలో రామ్ కూడా తన విజన్ ను తెరపై చూపించాలని భావిస్తున్నారట. కొత్త ప్రాజెక్ట్ ను భారీ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ జరుగుతోందని సమాచారం.
స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్, కొత్త టెక్నికల్ ట్రీట్మెంట్ తో రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా రామ్ తన నెక్స్ట్ సినిమాలో పూర్తిగా కొత్త లుక్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ పై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టాక్. ఇక సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య నిర్మాణ బాధ్యతలు చూసే అవకాశం ఉందని సమాచారం.
గతంలో కూడా రామ్ తన సినిమాల విషయంలో ప్రొడక్షన్ టీమ్ తో కలిసి చాలా యాక్టివ్ గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే మరింత కంట్రోల్ తో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మే 15న వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ కెరీర్ కు ఆ సినిమా చాలా కీలకమని చెప్పాలి. అందుకే ఈసారి ఎలాంటి తొందరపడకుండా.. పక్కా ప్లానింగ్ తోనే రంగంలోకి దిగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.