రామ్ పోతినేని.. రిస్క్ ను ఈజీగా డీల్ చేస్తారా?

ఇప్పుడు రామ్ కూడా ఇలాంటి సవాల్ ముందు నిలిచారు. ఆయన కొత్త చిత్రం RAPO23 స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కనుంది.

Update: 2026-05-18 07:36 GMT

టాలీవుడ్‌ హీరోలు దర్శకులుగా మారడం కొత్త విషయం కాదు. కానీ ఆ జర్నీలో అందరికీ విజయం దక్కిందా? అంటే సమాధానం మాత్రం మిక్స్ డ్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు అదే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కారణం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారడం. తన నెక్స్ట్ మూవీతో మెగాఫోన్ పట్టబోతున్నట్లు ప్రకటించిన రామ్.. నటుడిగా మాత్రమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను చేపట్టడం ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఇప్పటికే చాలా మంది తెలుగు హీరోలు.. డైరక్షన్ పై ఇంట్రెస్ట్ చూపించారు. కొందరు తమ ఆలోచనలను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తే, మరికొందరు తమ కెరీర్‌ కు కొత్త దిశ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకత్వంవైపు అడుగులు వేశారు. అయితే నటుడిగా సక్సెస్ అయినంత సులభంగా దర్శకుడిగా నిలబడటం అంత ఈజీ కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.

దర్శకత్వం అంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు. ఒకేసారి కథ, స్క్రీన్‌ ప్లే, నటీనటుల పనితీరు, టెక్నికల్ టీమ్, బడ్జెట్, షూటింగ్ ప్లానింగ్ వంటి అనేక అంశాలు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తే బాధ్యత మరింత పెరుగుతుంది. కెమెరా ముందు పాత్రలో పూర్తిగా మునిగిపోవాలి. అదే సమయంలో కెమెరా వెనుక ప్రతి ఫ్రేమ్‌ పర్యవేక్షించాలి. ఆ బ్యాలెన్స్ చేయలేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు రామ్ కూడా ఇలాంటి సవాల్ ముందు నిలిచారు. ఆయన కొత్త చిత్రం RAPO23 స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కనుంది. వీర పాత్రలో రామ్ కనిపించనుండగా.. ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ అనే క్యాప్షన్ క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ఆ ప్రాజెక్ట్‌ లో రామ్ తీసుకున్న బాధ్యతలు మాత్రం నార్మల్ వి కావు. హీరోగా నటించడం, కథ రాయడం, దర్శకత్వం వహించడం, నిర్మాణం భాగం కావడం.. ఇలా పెద్ద బాధ్యతలే మోస్తున్నారు.

ఇక టైమింగ్ కూడా ఇప్పుడు రామ్‌ కు కీలక అంశంగా మారింది. జూన్‌ లో షూటింగ్ ప్రారంభించి డిసెంబర్‌ లోనే సినిమాను విడుదల చేయాలని ప్రకటించారు. అంటే చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవైపు నటన, మరోవైపు దర్శకత్వం.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చూడడం పెద్ద బాధ్యతే. మరోవైపు రామ్‌ కు ఒక భారీ హిట్ కూడా చాలా అవసరం.

గత కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో నెక్స్ట్ మూవీ ఆయనకు కీలకంగా మారింది. అందుకే ప్రాజెక్టుపై అందరి దృష్టి పడింది. రామ్‌ లో ఉన్న ఎనర్జీ, డాన్స్, యాక్షన్, రైటింగ్ గురించి ఇప్పటికే ప్రేక్షకులకు తెలుసు. ఇటీవల ‘ఆంధ్రా కింగ్ తాలూకాలో పాట రాసి, పాడి తనలోని మరో కోణాన్ని చూపించారు. ఇప్పుడు దర్శకుడిగా తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే టాలీవుడ్‌ లో గత అనుభవాలను చూస్తే హీరో నుంచి దర్శకుడిగా మారడం అనేది పెద్ద రిస్క్ అని చెప్పాలి. కొందరు సక్సెస్ అయినా, చాలామంది మాత్రం ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు అందరి చూపు రామ్‌ పైనే ఉంది. ఆయన ఆ భారీ బాధ్యతలు ఈజీగా డీల్ చేస్తారా? దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతారా? అన్న ఆసక్తి కనిపిస్తోంది.

Tags:    

Similar News