"ఆ పిచ్చి పనులు మేం చేయం".. రామ్, నిర్మాత మాటల్లో కాన్ఫిడెన్స్

సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే కేవలం ఓపెనింగ్స్ వస్తే సరిపోదు, లాంగ్ రన్ లో ఆడియెన్స్ నమ్మకాన్ని గెలుచుకోవాలి.;

Update: 2025-12-03 04:20 GMT

సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే కేవలం ఓపెనింగ్స్ వస్తే సరిపోదు, లాంగ్ రన్ లో ఆడియెన్స్ నమ్మకాన్ని గెలుచుకోవాలి. 'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయంలో చిత్ర యూనిట్ సరిగ్గా ఇదే నమ్ముతోంది. సాధారణంగా సక్సెస్ మీట్లలో కలెక్షన్ల గురించి గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటాం. కానీ ఈ సినిమా థాంక్యూ మీట్ లో మాత్రం హీరో రామ్, నిర్మాత రవి చాలా నిజాయితీగా, వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా నిర్మాత రవి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. తమ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతోనే టికెట్ రేట్లు పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. రేట్లు పెంచడం వంటి "పిచ్చి పిచ్చి పనులు" తాము చేయలేదని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సాధారణ ధరలనే నిర్ణయించామని కుండబద్దలు కొట్టారు. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మాటల్లో అర్థమవుతోంది.

ఇక రామ్ పోతినేని ఆడియెన్స్ గురించి మాట్లాడిన తీరు ఆయనలోని పరిణితిని చూపించింది. తనకు ప్రేక్షకులంటే గౌరవం అని, వాళ్లు ఒక సినిమాను రిజెక్ట్ చేస్తే, దాన్ని బలవంతంగా వారిపై రుద్దడం తనకు అస్సలు ఇష్టం ఉండదని రామ్ క్లియర్ గా చెప్పారు. సినిమా ఆడకపోతే వెంటనే వేరే సినిమా పనిలో పడిపోతాను తప్ప, ఇలా సమర్థించుకోనని అన్నారు.

కానీ ఈ సినిమా విషయంలో పరిస్థితి వేరుగా ఉందని రామ్ వివరించారు. సినిమా చూసిన ప్రతి పది మందిలో తొమ్మిది మందికి కంటెంట్ నచ్చిందని, వారి నుంచే సినిమా బాగుంది అనే ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. కేవలం నవంబర్ అన్ సీజన్ ప్రభావం వల్లే ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నాయని, కానీ సినిమా చూసిన వాళ్లు మాత్రం గొప్పగా ఫీల్ అవుతున్నారని రామ్ విశ్లేషించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఎవరినీ ఫెయిల్ చేయదని రామ్ బలంగా నమ్ముతున్నారు. ఇంత మంచి సినిమాను ఇంకాస్త పుష్ చేయండి, జనాల్లోకి తీసుకెళ్లండి అని ఆడియెన్స్, మీడియా నుంచే తమకు రిక్వెస్టులు వస్తున్నాయని, అందుకే ఈ ప్రమోషన్స్ చేస్తున్నామని రామ్ చెప్పుకొచ్చారు. కంటెంట్ జెన్యూన్ గా ఉంది కాబట్టి, మెల్లగా అయినా సరే జనాలు థియేటర్లకు వస్తారనే ధీమా హీరోలో కనిపిస్తోంది.

మొత్తానికి టికెట్ రేట్ల పెంపు అనే అస్త్రాన్ని వాడకుండా, కేవలం మౌత్ టాక్ ని నమ్ముకుని ఈ సినిమా ముందుకెళ్తోంది. నిర్మాత రవి చెప్పినట్లు పిచ్చి పనులు చేయకుండా, నిజాయితీగా సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు మంచిదే. ఇక రామ్ నమ్మకం నిజమై, రాబోయే రోజుల్లో ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుందేమో చూడాలి.

Tags:    

Similar News