నాన్న జన్మనిస్తే.. నాగార్జున పునర్జన్మ..!
సంచలనం ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి.;
సంచలనం ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. ఆర్జీవి అంటేనే సినిమా మేకింగ్ లో ఒక ఎన్సైక్లోపీడియా అనే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. తొలి సినిమా శివతోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు వర్మ. శివ ఒక సినిమా కాదు.. ఒక గేం ఛేంజర్. అసలు ఆ సినిమాలో ఆ సైకిల్ చెయిన్ ఫైట్ అప్పటికీ ఇప్పటికీ ఒక మాసివ్ మూమెంట్. కాలేజ్ లో స్టూడెంట్ పాలిటిక్స్, ఫైట్స్, రౌడీయిజం ఇవన్నీ కూడా శివ సినిమా నుంచి మొదలైనవే.
తనపై నాగార్జున పెట్టిన నమ్మకం..
శివ సినిమా వచ్చి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ గురించి ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు ఆర్జీవి. శివ సినిమా టైం లో తనపై నాగార్జున పెట్టిన నమ్మకం గురించి చెబుతూ నాన్న జన్మనిచ్చాడు.. మొదటి అవకాశం ఇచ్చి నాగార్జున తనకు పునర్జన్మ ఇచ్చాడు అంటూ నెవర్ బిఫోర్ స్టేట్మెంట్ చేశాడు ఆర్జీవి.
ఆ టైం లో స్ట్రైక్ జరుగుతుంటే బాంబే వెళ్లి మరీ ఆడియో రికార్డ్ చేయించామని.. ఇది జరిగింది అంటే అది కేవలం నమ్మకం వల్లే అని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు ఆర్జీవి. శివ సినిమా టైం లో ఆర్జీవిపై నాగార్జున పెట్టిన ఆ నమ్మకమే నిలబెట్టింది. ఇప్పటికి కూడా శివ లాంటి సినిమా ఆర్జీవి నుంచి రావాలని కోరుతుంటారు అతని ఫ్యాన్స్.
శివతో మొదలు పెడితే..
శివ సినిమా రీ రిలీజ్ గురించి కూడా ఈమధ్యనే నాగార్జున రివీల్ చేశారు. త్వరలోనే సినిమా 4K రెడీ అవుతుందని.. త్వరలోనే రీ రిలీజ్ ఉంటుందని అన్నారు. నాగార్జున బర్త్ డే ఆగష్టు 29 ఉంది కాబట్టి ఆరోజు రీ రిలీజ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
శివతో మొదలు పెడితే ఆర్జీవి అప్పట్లో చేసిన సినిమాలు కొన్ని అద్భుతమైన సినిమాటిక్ వరల్డ్ ని క్రియేట్ చేశాయి. సినిమా ఇలానే తీయాలని అప్పటికే కొంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉండగా.. నాకు ఇష్టం వచ్చినట్టుగా సినిమా తీస్తా అంటూ వర్మ శివతో మొదలు పెట్టాడు.. తెలుగులోనే కాదు ఆర్జీవి ఫిల్మ్ మేకింగ్ గురించి పాన్ ఇండియా లెవెల్ లో మాట్లాడుకుంటారు. ఐతే ఇప్పుడు ఆర్జీవి ట్రాక్ తప్పేశాడు.. ఆయన మళ్లీ తన పాత రోజులను గుర్తు చేసుకుని అలాంటి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.