జాతీయ అవార్డును మించి యామీకి ఆర్జీవీ నుంచి ప్రశంస!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఒక కథానాయికను పొగిడేయడం అనేది చాలా అరుదు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఒక కథానాయికను పొగిడేయడం అనేది చాలా అరుదు. హీరోయిన్ లతో సరదా పరాచికాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆర్జీవీ ఈసారి మాత్రం భిన్నంగా కనిపించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి యామీ గౌతమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసారు. ఇంతకుముందు దురంధర్ దర్శకుడు యామి గౌతమ్ భర్త ఆదిత్యాధర్‌ని ఆకాశానికెత్తేసిన ఆర్జీవీ ఇప్పుడు అతడి భార్య యామీగౌతమ్ పై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరం.
యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన `ఆర్టికల్ 370` చిత్రానికి గాను యామి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ``ప్రతి ప్రయాణంలోనూ మనం ఎందుకు వెనకడుగు వేయకూడదో గుర్తుచేసే ఒక క్షణం వస్తుంది.. ఈ రోజు నాకు అలాంటి క్షణమే`` అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. తనకు వ్యక్తిగతంగా అవార్డుల సంస్కృతిపై ఎప్పుడూ నమ్మకం లేదని.. కానీ ఒక వ్యక్తి తన వృత్తిపై చూపే అంకితభావానికి, నిబద్ధతకు లభించే గుర్తింపును తాను నమ్ముతానని పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాజెక్ట్‌గా కాకుండా... తను బలంగా నమ్మిన ఒక కథను అంతే చిత్తశుద్ధితో యామీ గౌతమ్ తెరపైకి తీసుకురావడం వల్లే ఈ గౌరవం దక్కిందని ఆయన ప్రశంసించారు.
ఈ జాతీయ అవార్డు ఆమెకు ఒక గొప్ప గౌరవంగా అనిపించవచ్చు కానీ... తనకు మాత్రం ఆమె ఇక్కడి వరకు చేరుకోవడానికి పడ్డ కష్టం, పట్టుదల, తీసుకున్న రిస్క్‌లు .. ఎక్కడా లొంగిపోని నైజమే తనను ఎక్కువగా ఆకట్టుకున్నాయని ఆర్జీవీ అన్నారు. ఇటుక ఇటుక పేర్చి ఒక అందమైన భవనాన్ని నిర్మించినట్లుగా యామీ తన కెరీర్‌ను నిర్మించుకుంటూ ఈ స్థాయికి చేరిందని... భవిష్యత్తులో తన నుండి ఇలాంటివి మరెన్నో వస్తాయని ఆశిస్తూ అభినందనలు తెలిపారు.
జాతీయ అవార్డుల విజేతలపై సోషల్ మీడియాలో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు..
ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక సినీ అవార్డులలో అద్భుత ప్రదర్శన కనబరిచిన నటులు మమ్ముట్టి, యామీ గౌతమ్, మరియు కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటనకు గానూ పురస్కారాలు అందుకోవడం సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ``ఇండియన్ సినిమా ఫేస్`` అని కొనియాడుతూ.. ఆయనకు ఇది నాలుగో నేషనల్ అవార్డు అంటూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే `ఆర్టికల్ 370` చిత్రంలో పవర్ ఫుల్ నటనకు గానూ యామీ గౌతమ్ ఈ అవార్డుకు వంద శాతం అర్హురాలని నెటిజన్లు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఇక `చందు ఛాంపియన్` కోసం తీవ్రంగా శ్రమించిన కార్తీక్ కి గుర్తింపు దక్కినా అవార్డు రావడంపై కొన్ని విమర్శలున్నాయి.
ఈ అవార్డుల ఎంపికపై కామెంట్ల సెక్షన్‌లో నెటిజన్ల మధ్య తీవ్రమైన భిన్నాభిప్రాయాల నడుమ వివాదాలు రేగాయి. ముఖ్యంగా మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడితో సమానంగా కార్తీక్ ఆర్యన్‌కు అవార్డును షేర్ చేయడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ... `శ్రీకాంత్` చిత్రంలో నటించిన రాజ్‌కుమార్ రావు వంటి వారు దీనికి ఎక్కువ అర్హులని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు సౌత్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్‌గా వచ్చిన `మహారాజ`, `మెయ్యళగన్`, `కిష్కింధ కాండం` వంటి చిత్రాలను కాదని... కేవలం బాలీవుడ్ కమర్షియల్ చిత్రాలకే పెద్దపీట వేశారనే అసంతృప్తి కూడా వ్యక్తమైంది. దీనికి తోడు దేశంలో విద్యార్థుల హక్కులు, సామాజిక సమస్యలపై నోరు విప్పని సెలబ్రిటీలకు ఈ పురస్కారాలు ఎందుకంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఎప్పటిలాగే ఫన్నీ పజిల్స్, స్పామ్ కామెంట్లతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు.