సుకుమార్ అతన్ని రీప్లేస్ చేస్తాడా?
టాలీవుడ్ లో రానున్న క్రేజీ ప్రాజెక్టుల్లో రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ మూవీ కూడా ఒకటి.;
టాలీవుడ్ లో రానున్న క్రేజీ ప్రాజెక్టుల్లో రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ మూవీ కూడా ఒకటి. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఆల్రెడీ సుకుమార్ ఈ మూవీ క్యాస్టింగ్, బడ్జెట్ తో పాటూ మరో విషయంలో కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ లో బ్రాండ్ గా మారిన సుక్కూ- దేవీ కాంబో
అదే మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక. ఇప్పటివరకు సుకుమార్ నుంచి సినిమా వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండేది కాదు. ఆర్య సినిమా నుంచి పుష్ప సిరీస్ సినిమాల వరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమాకీ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌నే సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్ టాలీవుడ్ లో ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే.
చరణ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చాలనే యోచన
సుకుమార్ కథకు తగ్గ మ్యూజిక్, క్యారెక్టర్ కు తగ్గ బీజీఎం, మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సాంగ్స్.. ఇవన్నీ వీరిద్దరి జోడీ స్పెషాలిటీ. అందుకే చాలా మందికి సుకుమార్ అంటేనే దేవీశ్రీనే అనే ఫీలింగ్ చాలా బలంగా ఏర్పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం, సుకుమార్, రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఎల్లమ్మతో దేవీశ్రీ బిజీ
దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఎల్లమ్మ ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో, చరణ్ మూవీకి ఆయన డేట్స్ ఇవ్వడం కష్టమవుతుందేమోననే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఆర్ రెహమాన్ పేరుని పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే రెహమాన్ ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు మ్యూజిక్ ఇస్తుండటంతో, వరుసగా రెండో సినిమాకు ఆయన వర్క్ చేయడం కుదురుతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సి విషయమేంటంటే, సుకుమార్ ఇప్పటివరకు తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చింది లేదు. ప్రతీ మూవీలో కథ, జానర్ మారినా, మ్యూజిక్ విషయంలో మాత్రం ఆయన దేవీపై నమ్మకముంచి, ఈ నేపథ్యంలో చరణ్ మూవీకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడంటే, అది సుకుమార్ కెరీర్లోనే చాలా కీలక మార్పుగా చెప్పుకోవాలి. అసలే ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ కావడంతో మ్యూజిక్ పాత్ర మరింత కీలకంగా మారింది. కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా, కథను ముందుకు నడిపించే బీజీఎం, ఎమోషనల్ గ్రాఫ్ ను ఎలివేట్ చేసే స్కోర్, మాస్ ఎలిమెంట్స్ కు సరిపోయే థీమ్ మ్యూజిక్, ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో ఉండాల్సిందే. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సుకుమార్ తొందరపాటుతో కాకుండా, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా సుకుమార్- చరణ్ మూవీలో హీరోయిన్ గా కూడా పెద్ది మూవీలో నటిస్తున్న జాన్వీ కపూర్ నే తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.