నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎవరి రంగంలో వారే తోపు!
ఏదైనా ఒక పబ్లిక్ వేదికపై ఒక రాజకీయ నాయకుడు- ఒక సినిమా స్టార్ మధ్య పోలికలు చెబితే అది నిజంగా ప్రజల్లో క్యూరియాసిటీని పెంచుతుంది
ఏదైనా ఒక పబ్లిక్ వేదికపై ఒక రాజకీయ నాయకుడు- ఒక సినిమా స్టార్ మధ్య పోలికలు చెబితే అది నిజంగా ప్రజల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. రాజకీయం-సినిమా రెండూ సమాంతరంగా విభిన్నమైన రంగాలు అయినా, ఆయా రంగాల్లో ఆ ఇద్దరి కృషిని ప్రజలు భేరీజు వేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ తో రామ్ చరణ్ పోలికపైనా నెటిజనుల్లో ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది.
ఇటీవల జరిగిన `రిపబ్లిక్ సమిట్ 2026` వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వినోద రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చరణ్‌ను.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌తో పోలుస్తూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారసత్వాన్ని పక్కనపెట్టి స్వయంకృషి, కష్టంతో ఎదుగుతున్న తీరుపై వారిద్దరి మధ్య ఉన్న పోలికను చరణ్ అంగీకరించారు.
సదస్సులో భాగంగా ఒక రిపోర్టర్ రామ్ చరణ్‌ను ప్రశ్నిస్తూ.. ``తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా..లోకేష్ నాయుడు దాన్ని ఎప్పుడూ అదనుగా తీసుకోలేదు. తన స్వయంకృషితో.. ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రజా నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. మీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి పెద్ద స్టార్ అయినా మీరు కూడా అలాగే కష్టపడ్డారు. మీ ఇద్దరి మధ్య ఈ పోలిక ఉందని భావిస్తున్నారా?`` అని అడిగారు. దీనికి రామ్ చరణ్ ఏమాత్రం తడుముకోకుండా.. `కచ్చితంగా ఉంది...`` అంటూ నారా లోకేష్‌తో తనకున్న పోలికను మనస్ఫూర్తిగా అంగీకరించారు.
నిజానికి ఒక సూపర్ స్టార్ కొడుకైన రామ్ చరణ్‌ను, రాజకీయాల్లో అగ్రనేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ నాయుడుతో పోల్చడం యాథృచ్ఛికమే అయినా.. వారిద్దరి ప్రయాణంలో ఎన్నో సమాంతర విషయాలు ఉన్నాయి. ఎవరి రంగాల్లో వారు అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్నారు. నారా లోకేష్ ఒక సమర్థవంతమైన నాయకుడిగా ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకేష్.. ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్ కంపెనీలతో నిరంతరం సత్సంబంధాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించడమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్ తాను ఎంపిక చేసుకున్న వినోద రంగంలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. రెండు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి ప్రజలను అలరించారు. మరోవైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి సామాజిక సేవల్లోను చరణ్ ఎప్పుడూ ముందున్నారు. ఇటీవల `పెద్ది` సినిమాతో ప్రజలను అలరించిన చరణ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను ఆస్వాధిస్తూ కోట్లాదిమంది మనసులను గెలుచుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వినోదాన్ని అందించడంలో అతడు తన రంగంలో పీక్ స్టేజ్‌లో ఉన్నారు. తండ్రుల అపారమైన కీర్తి ప్రతిష్టలు వెనకున్నా.. ఆ నీడ నుంచి బయటకు వచ్చి తమకంటూ సొంత బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవడంలో ఇద్దరూ సఫలమయ్యారు.
ఈ ఇద్దరు యంగ్ ట్యాలెంట్ తమ తండ్రుల పాపులారిటీని కేవలం ఒక పునాదిగా మాత్రమే వాడుకున్నారు కానీ.. ఆ తర్వాత సాధించిన ప్రతి విజయం వారి సొంత కష్టం- వ్యూహం -అంకితభావం వల్లే సాధ్యమైంది. అందుకే రిపబ్లిక్ సమిట్ వేదికగా రామ్ చరణ్, నారా లోకేష్ గురించి రిపోర్టర్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా హల్ చల్ చేస్తోంది.