బాలీవుడ్ స్టార్లకు ఐక్యత తెలియదా?
నన్ను సినిమాలో చూసి ఆ తర్వాత అవకాశాలు ఇస్తారని అనుకున్నాను. నాకు చాలా విషయాలు తెలియవు. ఎలాంటి దుస్తులు ధరించాలో గైడ్ చేయడానికి లేదా చెప్పడానికి ఎవరూ లేరు.;
హిందీ చిత్రసీమపై ఇటీవల ప్రతికూల వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. అక్కడ తారల నడుమ సఖ్యత గురించి చాలా విమర్శలు ఉన్నాయి. ఒకరికొకరు అభద్రత కారణంగా ఒత్తిడితో జీవిస్తారని కూడా పలువురు విమర్శించారు. అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు బాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. అక్కడ నటీనటులలో అభద్రతాభావం గురించి ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యారు.
ఐక్యత చాలా ముఖ్యం:
హిందీ పరిశ్రమలో నటుల అభద్రతపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేసారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ హిందీ చిత్రసీమలో వర్క్ కల్చర్ ని దక్షిణాది తో పోల్చి వర్ణించడం చర్చగా మారింది. హిందీ చిత్రసీమలో సహనటుల మధ్య ఐక్యత ఉండదని రకుల్ వ్యాఖ్యానించారు. పని కట్టుబాట్ల విషయంలో సౌత్ నటులు ఒకటిగా ఉంటారని అన్నారు. పని విషయంలో ఇది మాది కాదు! అనే భావన వారి మధ్య ఉండదు. అందరూ కలిసి కట్టుగా పనిని పూర్తి చేస్తారని తెలిపారు. ఇది హిందీ చిత్రసీమలో కరువడిందని అన్నారు. అలాగే బాలీవుడ్ లో నటీనటులు అభద్రతాభావానికి గురవుతారని కూడా రకుల్ వెల్లడించారు. నిజానికి నేను కొందరు సీనియర్ నటులతో మాట్లాడినప్పుడు ``ఆ రోజుల్లో ఇలా ఉండేది కాద``ని తనతో అన్నారని రకుల్ గుర్తు చేసుకున్నారు.
అప్పటికి అవగాహన లేదు:
2014లో యారియన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆరంగేట్ర నటికి పరిశ్రమలో అవకాశాలు ఎలా వస్తాయో తనకు తెలియదని అన్నారు. ఆ సమయంలో తనను తాను బాలీవుడ్ లో ప్రమోట్ చేసుకోవడానికి కొన్ని మెషీన్లు (యంత్రాలు) పని చేయాల్సి ఉంటుందనే విషయం తనకు తెలియదని అన్నారు. సరైన పీఆర్ మెయింటెయిన్ చేయడం, ఫంక్షన్లు లేదా పార్టీలకు వెళ్లడం, ఇతర సత్సంబంధాలు కొనసాగించడం తనకు నిజంగా తెలియదని రకుల్ అంగీకరించింది. యారియాన్ లో తన నటనకు మంచి పేరొచ్చింది. అది చూసి తదుపరి సినిమాల్లో అవకాశాలు వస్తాయని తాను భావించినట్టు తెలిపింది. అదే సమయంలో హైదరాబాద్ లో తాను వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నానని, దీని కారణంగా హిందీ పరిశ్రమలో తనకు ఏదీ వర్కవుట్ కాలేదని కూడా తెలిపింది.
నన్ను సినిమాలో చూసి ఆ తర్వాత అవకాశాలు ఇస్తారని అనుకున్నాను. నాకు చాలా విషయాలు తెలియవు. ఎలాంటి దుస్తులు ధరించాలో గైడ్ చేయడానికి లేదా చెప్పడానికి ఎవరూ లేరు. స్టైలిస్టులు ఉంటారని, ప్రమోషన్ల కోసం వెళ్ళేటప్పుడు వారిని నియమించుకోవాలని నాకు తెలియదని కూడా రకుల్ తెలిపారు. తాను యారియాన్ విడుదలైనప్పుడు తెలుగులో మూడు చిత్రాలు చేస్తున్నానని కూడా రకుల్ వెల్లడించారు.
దేదే ప్యార్ దే ప్రచారంలో..
సౌత్ లో అగ్ర కథానాయికగా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హిందీ చిత్రసీమలో అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన తర్వాత సొంత బ్యానర్ లో రకుల్ ఎక్కువగా సినిమాలు చేస్తోంది. అజయ్ దేవగన్ తో కలిసి నటించిన `దేదే ప్యార్ దే` సీక్వెల్ ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో రకుల్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది- దక్షిణాది పరిశ్రమల పని సంస్కృతిలో వైరుధ్యాల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.