చిరు 'గ్యాంగ్ లీడర్'లో 'దురంధర్' నటుడు
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు అర్థ శతాబ్దం పూర్తయినా.. సరైన గుర్తింపు కోసం ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని సీనియర్ నటుడు రాకేశ్ బేడీ ఆవేదన వ్యక్తం చేశారు.;
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు అర్థ శతాబ్దం పూర్తయినా.. సరైన గుర్తింపు కోసం ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని సీనియర్ నటుడు రాకేశ్ బేడీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే `ధురంధర్ 2` చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఆయన పోషించిన జమీల్ జమాల్ అనే పాకిస్తానీ రాజకీయ నాయకుడి పాత్రకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఒకే ఒక్క సినిమాతో తన 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని.. ఇప్పుడు తన దశ దిశ మారిపోయాయని ఆయన ఎంతో ఆనందంగా చెబుతున్నారు.
రాకేశ్ బేడీ సినీ ప్రస్థానాన్ని గమనిస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన `గ్యాంగ్ లీడర్` చిత్రంతో ఒక ఆసక్తికరమైన కనెక్షన్ కనిపిస్తుంది. 1991లో విడుదలైన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను హిందీలో `ఆజ్ కా గూండా రాజ్`గా రీమేక్ చేసినప్పుడు అందులో రాకేశ్ బేడీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పండించిన నటన అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. అదే చిత్రంలో నేటి మాస్ మహారాజా రవితేజ కూడా హీరో స్నేహితుల్లో ఒకరిగా నటించడం విశేషం.
దాదాపు 35 ఏళ్ల క్రితం ఒకే సినిమాలో కలిసి నటించిన వీరి ముగ్గురి ప్రయాణం ఇప్పుడు విభిన్నంగా ఉంది. చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదగగా, రవితేజ టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా స్థిరపడ్డారు. కానీ రాకేశ్ బేడీ మాత్రం ఇన్నేళ్లయినా ఒక క్యారెక్టర్ నటుడిగానే ఉండిపోయారు. దీనిని విధి అని సరిపెట్టుకోవాలా లేక సరైన ప్రణాళికా లోపం అనుకోవాలా అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో సాగుతోంది.
ఎట్టకేలకు `ధురంధర్ 2` సాధించిన అసాధారణ విజయం రాకేశ్ బేడీకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆయనకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆయనకు వరుసగా సినిమా ఆఫర్లు రావడమే కాకుండా పారితోషికం కూడా ఐదింతలు పెరిగినట్లు సమాచారం. 50 ఏళ్ల కెరీర్‌లో దక్కని గుర్తింపును ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టడం ఆయన నటనా ప్రతిభకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.
ప్రస్తుతం రాకేశ్ బేడీకి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల నుండి కూడా భారీ ఆఫర్లు అందుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి, రవితేజలతో కలిసి వెండితెరను షేర్ చేసుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వారితో కలిసి నటించే అవకాశం వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `ధురంధర్ 2` ఇచ్చిన ఊపుతో ఆయన దక్షిణాది సినిమాల్లో కూడా బిజీ నటుడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.