కమల్ చెప్పిన బిస్కెట్ కథ
తాజాగా ఒక అవార్డుల వేడుకలో కమల్ హాసన్.. రజినీ తో కలిసి సినిమా చేయబోతున్న విషయాన్ని కన్ఫమ్ చేశారు.;
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లది తిరుగులేని కాంబినేషన్. వీళ్లిద్దరూ కెరీర్ ఆరంభంలో అపూర్వ రాగంగల్ లాంటి క్లాసిక్‌తో మొదలుపెట్టి ఇద్దరూ రెండంకెల సినిమాల్లో కలిసి నటించారు. వ్యక్తిగతంగా కూడా వీళ్లిద్దరూ ఆత్మీయ స్నేహితులు. ఐతే పెద్ద స్టార్లుగా ఎదిగాక రజినీ, కమల్ కలిసి నటించలేదు. గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా సరే.. సాధ్యం కాలేదు. ఇద్దరూ 50 ఏళ్లకు పైగా సినిమా కెరీర్‌ను పూర్తి చేసుకోగా.. దాదాపు 40 ఏళ్ల నుంచి కలిసి నటించలేదు.
ఐతే ఎట్టకేలకు యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ లెజెండరీ నటులిద్దరితో కలిపి సినిమా చేయనున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వస్తున్నాయి. కూలీ సినిమా ప్రి రిలీజ్ ఇంటర్వ్యూల్లో కూడా తాను ఆ ప్రయత్నంలో ఉన్నట్లు లోకేష్ వెల్లడించాడు. ఐతే కూలీ అనుకున్నంతగా ఆడని నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందో లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రజినీ, కమల్ కలిసి నటించబోతున్న మాట నిజమే అని తేలింది. స్వయంగా కమల్ హాసనే ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
తాజాగా ఒక అవార్డుల వేడుకలో కమల్ హాసన్.. రజినీతో కలిసి సినిమా చేయబోతున్న విషయాన్ని కన్ఫమ్ చేశారు. మీరిద్దరూ కలిసి ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్న మాట వాస్తవమేనా అని అడిగితే.. తాము కలిసి సినిమా మాత్రమే చేస్తామని.. అది అద్భుతమా కాదా అన్నది ప్రేక్షకులే నిర్ణయించాలని.. తాము చాలా ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న మాట మాత్రం వాస్తవమే అని కమల్ స్పష్టం చేశారు. ఒకప్పుడు తామిద్దరం ఒక బిస్కెట్‌ను రెండుగా పంచుకుని తినేవాళ్లమని.. కానీ తర్వాత ఒకరికి ఒక ఫుల్ బిస్కెట్ కావాలని అనిపించిందని.. దీంతో అలాగే ఎవరి బిస్కెట్ వాళ్లు తింటూ చాలా ఏళ్లు గడిపేశామని.. కానీ ఇప్పుడు మళ్లీ ఒక బిస్కెట్‌ను ఇద్దరు పంచుకుందాం అనే ఆలోచన వచ్చి సినిమా చేస్తున్నామని కమల్ విచిత్రమైన పోలిక చెప్పాడు.
తామిద్దరం కలిసి మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నం జరిగినా.. ఇప్పటికి అది సాధ్యపడుతోందని కమల్ అన్నాడు. తాము ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని కూడా అనుకున్నామని.. కానీ అంతా బాగానే ఉంది కదా అని ఆ ప్రయత్నం చేయలేదని.. తామిద్దరం కలిసి సినిమా చేస్తే బిజినెస్ పరంగా అది ఆశ్చర్యకరంగా ఉండొచ్చని.. కానీ మిత్రులమైన తాము కలిసి సినిమా చేయడం తమకు మామూలు విషయమే అని.. తమ మధ్య ఎప్పుడూ పోటీ లేదని కమల్ అన్నాడు.