సూపర్ స్టార్ సినిమా కోసం ఇలా అక్కర్లేదు..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళనాట సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది.;

Update: 2025-12-02 16:30 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళనాట సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ ఉత్తర భారత దేశంలో, సౌత్ లోని ఇతర రాష్ట్రాల్లో సినిమా ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరో నాగార్జున కూలీ సినిమాలో నటించడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. నాగార్జున పాత్ర విషయంలోనే కాకుండా కథ కథనం సంగీతం ఇలా ప్రతి విషయంలో కూడా కూలీ సినిమా నిరుత్సాహ పరచడంతో రజనీకాంత్ ఇక ముందైనా సినిమాలను చేయడం మానేయాలి అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా సూచిస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. కూలీ సినిమా నిరాశను మిగిల్చినప్పటికీ రజినీకాంత్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పటికే తన తదుపరి సినిమా జైలర్ 2 ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జైలర్ సినిమాతో రజినీకాంత్...

రజనీకాంత్ కెరియర్ ఖతం అయింది అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జైలర్ సినిమాతో రజనీకాంత్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆయన మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు జైలర్ సినిమా చాలా సహాయపడిందని అంటారు. అందుకే జైలర్ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనకి సూపర్ స్టార్ రజనకాంత్ వెంటనే ఓకే చెప్పడం జరిగింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రాబోతున్న జైలర్ సినిమాలో పలువురు స్టార్ హీరోలు గెస్ట్ పాత్ర కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాలో నటించాడు. తెలుగు స్టార్ హీరో బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ రజినీకాంత్ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ బాలకృష్ణ చాలా బిజీగా ఉన్న కారణంగా గెస్ట్ రోల్ చేయడం సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. దాంతో బాలకృష్ణ చేయాల్సిన పాత్రను మరో సీనియర్ హీరోతో చేయించారని ఆమధ్య ప్రచారం జరిగింది.

బాలకృష్ణ జైలర్ సినిమాలో నటించేందుకు...

జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ పాత్ర విషయాన్ని పక్కన పెడితే మరో కీలకమైన గెస్ట్ రోల్ ఉంటుందని దానికోసం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దర్శకుడు నెల్సన్ దిలీప్ స్వయంగా ముంబై వెళ్లి పాత్రకు సంబంధించిన విషయాలను షారుక్ ఖాన్ తో చర్చించారని తెలుస్తుంది. రజినీకాంత్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్తే సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా జైలర్ 2 సినిమా మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. సీనియర్ స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఇప్పటికీ మంచి స్టార్ డం ఉన్న హీరో అందుకే ఆయన ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం ద్వారా హిందీ ప్రేక్షకులకు దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని దర్శకుడు నెల్సన్ దిలీప్ భావిస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాల అంచనా.

దర్శకుడు నెల్సన్ దిలీప్...

మరోవైపు రజనీకాంత్ అభిమానులు మాత్రం తమ సూపర్ స్టార్ సినిమాకి ఇంతగా హంగులు అవసరం లేదని, కేవలం రజినీకాంత్ ఉంటే చాలు అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది గెస్ట్ లు అయ్యారు. సినిమాలో గెస్ట్ లు ఎక్కువ అయితే కథనం విషయంలో బెడిసి కొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే దర్శకుడు నెల్సన్ దిలీప్ జాగ్రత్త పడాలని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా గెస్ట్ లకు సంబంధించిన పాత్రల విషయంలో జాగ్రత్తగా లేనట్లయితే మొత్తం కథనం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. సినిమాకు బజ్ తీసుకురావడం కోసం స్టార్స్ ను గెస్ట్ లుగా నటింపజేస్తే కొన్ని సందర్భాల్లో ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నెల్సన్ దిలీప్ జైలర్ సినిమా కోసం పలువురు స్టార్స్ ని సంప్రదిస్తున్న సమయంలో రజినీకాంత్ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ సినిమా కోసం ఇలాంటి పనులు అక్కర్లేదు అంటూ వారు సోషల్ మీడియా ద్వారా దర్శకుడికి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దర్శకుడు మాత్రం కథలో భాగంగానే గెస్ట్ స్టార్స్ వస్తారని అందుకు తగ్గట్లుగానే నటీనటులను ఎంపిక చేస్తున్నాను అని అంటున్నాడు. ఈ సినిమాకు అనిరుద్ అందించబోతున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది, సినిమాలో వినోదంతో పాటు యాక్షన్ అన్ని వర్గాల వారిని అలరిస్తుందని దర్శకుడు హామీ ఇస్తున్నాడు.

Tags:    

Similar News