ర‌జ‌నీకాంత్ `అల్లుడు - కూతురి` క‌థ‌తో సినిమా?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగి తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

Update: 2026-10-02 03:45 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు `ధర్మన్` (తాత్కాలికంగా తలైవర్ 173) అనే టైటిల్ ఖరారైంది. రజనీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించేందుకు అగ్ర తారలు క్యూ కట్టడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక `డెడ్లీ డాక్టర్` పాత్రలో నటిస్తుండగా, క్రిమినల్స్‌‌పై ఆయన సాగించే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని రజనీకాంత్‌కు అల్లుడిగా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా... అత‌డి సరసన రాశీ ఖన్నా (ర‌జ‌నీకి కూతురి పాత్రలో) నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో సిమ్రాన్, యోగి బాబు వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో అలరించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి రజనీకాంత్, రామ్, రాశీ ఖన్నా కలిసి ఉన్న కొన్ని ఫోటోలు పొరపాటున ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాక‌ ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసారు. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయినా మైసూర్‌ వేదికగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ గురించిన విషయాలు బయటకు రావడానికి ఆ ఘటన కారణమైంది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కే.ఎస్. రవికుమార్, సుందర్ సి, సిబి చక్రవర్తి వంటి దర్శకుల పేర్లు ప్రారంభంలో పరిశీలనకు వచ్చినా తుది బాధ్యతలను అశ్వత్ మారిముత్తు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల మైసూర్‌లో ముగిసిన మూడో ప్రధాన షూటింగ్ షెడ్యూల్‌లో రజనీకాంత్ చూపిన అంకితభావం.. అణకువను దర్శకుడు అశ్వత్ బహిరంగంగా ప్రశంసిస్తూ.. ఆయన కొత్త నటుడిలా కష్టపడుతున్నారని కొనియాడారు.

ఇప్పటికే రామ్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఎంచుకున్న క్రైమ్ క‌థాంశం.. రామ్ క్యారెక్టర్ ట్రెండ్‌కు తగినట్టుగా దాని కొనసాగింపుపై మరింత లోతుగా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. తండ్రి-కూతురు, అల్లుడు అనే సరికొత్త కోణంతో తమిళం, తెలుగు ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News