వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే వాళ్లదే!
ఇంత వేగంగా రజనీకాంత్ ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ ని రిపీట్ చేయలేదు. హీరోగా చాలా సినిమాలు చేసారు.;
సక్సెస్ కాంబినేషన్లు రిపీట్ అవ్వడం సహజం. కానీ వెంట వెంటనే మాత్రం అది సాధ్యం కాదు. హిట్ ఇచ్చినా...ప్లాప్ ఇచ్చినా? మళ్లీ ఆ కాంబినేషన్ చేతులు కలపడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇలా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సినిమాలు చేయడం అన్నది ఆ ద్వయానికే సాధ్యమైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' తో ఎలాంటి బ్లాక్ బస్టర్ అందించాడో తెలిసిందే.
ఈ సినిమా ఏకంగా రజినీ కాంత్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. 600 కోట్లకు పై గా వసూళ్లు సాధించింది. దీంతో మరో ఆలోచన లేకుండా సూపర్ స్టార్ సీక్వెల్ కథని సిద్దం చేయమని ఆదేశాలివ్వడం 'జైలర్ 2'ని పట్టాలెక్కించడం ఎంత వేగంగా జరిగిందో తెలిసిందే. 'కూలీ' సినిమా ఆన్ సెట్స్ లో ఉన్నా లోకేష్ కనగరాజ్ ని తొందర పెట్టి మరీ షూటింగ్ పూర్తి చేసి 'జైలర్ 2' ఆన్ సెట్స్ కు తీసుకెళ్లారు.
ఇంత వేగంగా రజనీకాంత్ ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ ని రిపీట్ చేయలేదు. హీరోగా చాలా సినిమాలు చేసారు. ఎన్నో గొప్ప చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. కానీ ఆ దర్శకులెవరికీ ఇవ్వని ఛాన్స్ నెల్సన్ కి ఇచ్చారు. సరిగ్గా ఇంతకు మించిన వేగాన్ని చూపిస్తున్నాడు మరో కోలీవుడ్ స్టార్ ధనుష్. మాజీ మామగారిని స్పూర్తిగా తీసుకుని ధనుష్ కూడా ఇదే వేవ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా తో ధనుష్ 'కుభేర' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఈ చిత్రం పూర్తయిన వెంటనే మరో చిత్రాన్ని కమ్ములాతోనే ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'కుభేర' మేకింగ్ నచ్చి ఈ ఛాన్స్ ఇచ్చినట్లు వినిపిస్తుంది. ఇలా నెల్సన్- కమ్ములా స్టార్ హీరోలిద్దరితో వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సినిమాలు చేస్తున్నారు.