డేడ్లీ డాక్టర్ గా రజనీకాంత్ విధ్వంసం!

సూపర్ స్టార్ రజనీకాంత్ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన‌ పాత్రలతో కోట్లాది మంది అభిమానులను అలరించారు.

Update: 2026-09-22 11:30 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన‌ పాత్రలతో కోట్లాది మంది అభిమానులను అలరించారు. అయితే ఎన్న‌డు లేని విధంగా సూప‌ర్ స్టార్ తొలిసారి డెడ్లీ డాక్టర్ పాత్రలో అల‌రించ‌బోతున్నారు.

`ఓ మై కడవులే`, `డ్రాగన్` చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ధర్మన్. ఇందులో ర‌జనీకాంత్ మాస్ ఇమేజ్‌కి సరికొత్త డార్క్, ఎడ్జీ షేడ్‌ను జోడిస్తూ రూపొందిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ పాత్ర తీరుతెన్నులు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

సర్జికల్ స్కాల్పెల్ తో ఆపరేషన్ థియేటర్‌లోనే విలన్లపై విరుచుకుపడే వైలెంట్ డాక్టర్‌గా రజనీకాంత్ క‌నిపించ‌డం సినిమా స్కేల్‌ను తెలియ జేస్తోంది. వైద్యం చేసే సాధు స్వభావిగానే కాకుండా నేరస్థుల పాలిట కాలయముడిగా మారే సీనియర్ మెడికల్ ప్రొఫెసర్ పాత్రలో రజనీ తనదైన మార్క్ స్వాగ్, మ్యానరిజమ్స్‌తో విధ్వంసం సృష్టించబోతున్నారని తెలుస్తోంది. అశ్వత్ మారిముత్తు మేకింగ్ విధానం ప్రాజెక్ట్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సూపర్ స్టార్ ఇమేజ్‌ను ఏమాత్రం తగ్గించకుండా నేటితరం ప్రేక్షకులకు నచ్చేలా విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులను ప్లాన్ చేశారు.

ప్రముఖ స్టంట్ మాస్టర్లు అన్బరివ్ కంపోజ్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు చిత్రంలో హైలైట్‌గా నిలవ నున్నాయి. అశ్వత్ విజన్ ,రజనీకాంత్ మాస్ అప్పీల్ కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ చేస్తారంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సుదీర్ఘ షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇటీవల మూడో షెడ్యూల్‌ను ప్రారంభించింది.

సెట్స్ నుంచి వచ్చిన బిహైండ్ ది సీన్స్ వీడియోలలో రజనీకాంత్ జూనియర్ డాక్టర్లకు లెక్చర్ ఇస్తున్న సన్నివేశాలు, రాశీ ఖన్నాతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. `కెట్ట పయ్యన్ సర్` అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన డెడ్లీ డాక్టర్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కైకి తీసుకెళ్తుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు `జైలర్ 2` వంటి భారీ ప్రాజెక్ట్ లైన్‌లో ఉండగానే.. మరోవైపు యువ దర్శకుడితో రజనీకాంత్ చేస్తోన్న `ధర్మన్` పై అంచ‌నాలు రెట్టింపు అవ్వ‌డం మ‌రింత క్రేజీగా మారుతోంది. జైల‌ర్ గ‌నుక 1000 కోట్ల క్ల‌బ్ లో చేరితో? ధ‌ర్మ‌న్ పై అంచ‌నాలు ఇంకా రెట్టింపు అవుతాయి.

Tags:    

Similar News