వెండి తెరపై తొలిసారి చూసుకున్నపుడు రజనీ ఏం చేశారో తెలుసా ?

సూపర్ స్టార్ రజినీ టైటిల్స్ లో ఈ పేరు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే. మూడే అక్షరాలు వారికి మంత్రాక్షరాలుగా కనిపిస్తాయి, వినిపిస్తాయి దటీజ్ రజనీ.;

Update: 2025-08-17 12:32 GMT

సూపర్ స్టార్ రజినీ టైటిల్స్ లో ఈ పేరు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే. మూడే అక్షరాలు వారికి మంత్రాక్షరాలుగా కనిపిస్తాయి, వినిపిస్తాయి దటీజ్ రజనీ. ఈ రజినీ అన్న మూడు అక్షరాలు అంత పవర్ ఫుల్ కావడానికైనా లేదా బిగ్ సౌండ్ చేయడానికైనా వెనక ఎంతటి కఠోర పరిశ్రమ ఉందో చాలా మందికి తెలియదు. రజనీ కాంత్ అన్న పేరు తెర మీద ఆయనది. ఆ పేరుకు అర్ధం చందమామ కాంతులు విరబూయించేవారు అని. నిజంగా వెండి తెర మీద వెన్నెలలు వెదజల్లిన ఘనత రజనీదే.

అర్ధశతాబ్దం అద్భుతం :

రజనీకాంత్ తమిళ సినీ సీమ నుంచి చిన్న నటుడుగా ప్రస్థానం మొదలెట్టారు. ఆ తరువాత ఆయన అంచెలంచెలుగా ఎదిగారు సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. తమిళనాడులో ఒక ఎంజీఆర్, ఒక శివాజీ గణేషన్ మాస్ హీరోలుగా ఒక ఇమేజ్ ని సాధించారు. రజనీ కాంత్ అయితే ఆ మాస్ పల్స్ ని మరింతగా పట్టుకుని తన హీరోయిజాన్ని అందులో మిళాయించి తమిళ సినిమాను ఖండాంతరాల్లో నిలబెట్టారు. స్టైల్ అంటే రజనీ అన్నది డెబ్బై ఎనభై దశకం నాటి మాట. సిగరెట్ ని గాలిలో ఎగరేయడం వేగంగా దూసుకుని వస్తున్నట్లుగా నడవడం ఆయన మార్క్ ఫ్యాషన్. అంతే కాదు డైలాగ్ డెలివరీ కూడా ఆయనది ప్రత్యేకంగా ఉంటుంది. స్పీడ్ గా మాట్లాడుతారు అది ఒక స్టైల్ అయిపోయింది

మొదటి సారి మెరిసింది అలా :

రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయనది కర్ణాటక. బెంగళూరు ఆర్టీసీ బస్ కండక్టర్ గా ఆయన ఉద్యోగ జీవితం నడుస్తోంది. అయితే ఆయన పాతికేళ్ళ వయసు వరకూ సినిమాలను చూస్తూనే గడిపారు. తనకు నటించాలని ఆసక్తి ఉంది తన మ్యానరిజం ని ఫ్రెండ్స్ ని చూపిస్తూ అప్పటి తనలోని నటుడిని వారికే తొలిగా పరిచయం చేశారు. ఇక చిన్న నాటకాలు వేస్తూ స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. అయితే రజనీకాంత్ లోని నటుడిని కేవలం బస్ కండక్టర్ గా ఉండిపోరాదని భావించి మిత్రులు ప్రోత్సహించారు. దాంతో ఆయన చెన్నైకి వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఆ కోర్సు పూర్తి చేసిన వెంటనే అవకాశాలు వచ్చాయి. అలా అప్పటికే బాగా పెరు తెచ్చుకున్న దిగ్దర్శకుడు కె బాలచందర్ డిస్కవరీగా సినీ సీమకు రజనీ పరిచయం అయ్యారు.

చిన్న పాత్రతో పెద్ద గుర్తింపు :

ఇక రజనీకాంత్ తొలి చిత్రం పేరు అపూర్వ రాగంగళ్. ఈ మూవీ 1975 ఆగస్టు 15న తమిళనాడు అంతటా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అప్పటికే మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రీవిద్యకు భర్తగా ఒక చిన్న పాత్రలో రజనీ కాంత్ కనిపించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ జయసుధ మేజర్ సుందర రాజన్, నగేష్ వంటి వారు కీలక పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాను కళా కేంద్ర మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. నిర్మాతలుగా వి గోవిందరాజన్, జె దొరైస్వామి వ్యవహరించారు.

సరికొత్త కధాంశంగా :

ఇక ఆనాటి సంప్రదాయ సినిమాలు కధలకు భిన్నంగా వినూత్నమైన కధతో కె బాలచందర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హీరో కమల్ తన కంటే ఎక్కువ వయసు ఉన్న శ్రీవిద్యను ప్రేమిస్త్తారు. శ్రీవిధ్య కుమార్తె పాత్ర పోషించిన జయసుధ కమల్ తండ్రి పాత్రధారి అయిన మేజర్ సుందర రాజన్ ని ప్రేమిస్తుంది. ఈ సినిమాలో శ్రీవిద్య భర్త పాండ్యన్ పాత్రని రజనీకి ఇచ్చారు బాల చందర్. ఈ సినిమాని ఆనాటి సంప్రదాయవాదుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా సినిమా సూపర్ హిట్ అయింది.

రజనీ భావోద్వేగాలు

తన తొలి సినిమాను రజనీకాంత్ బెంగళూరులోని కపాలి థియేటర్‌లో చూశారు. సినిమా విడుదల అయిన రోజునే తన ప్రాణ మిత్రుడు అయిన రాజ బహద్దూర్‌తో కలిసి రజనీ ఈ సినిమాను చూశారు. వెండి తెర మీద తాను తొలిసారి అలా కనిపించిన తీరుని చూసుకుని రజనీ భావోద్వేగానికి గురు అయ్యారు. ఆ తర్వాత సినిమా చూసి బయటకు వచ్చిన రజనీకాంత్ వెండితెరపై మొదటి సారి తాను నటించినందుకు సంతోషం పట్టలేక పెద్ద పెట్టున ఏడ్చేశారు. అలా తొలి సినిమా తొలి విజయం దిగ్దర్శకుడు బాలచందర్ గురుత్వం అన్నీ కలసి రజనీకి అధ్బుతమైన భవిష్యత్తుని ఇచ్చాయి. అందుకే యాభై ఏళ్ళ తన సినీ ప్రస్థానాన్ని రజనీ దిగ్విజయంగా ఈ రోజున కూలీ సినిమా దాకా కొనసాగిస్తూ జైత్ర యాత్రతో ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News