పదే పదే దర్శకుడి మార్పు.. క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్!
రజనీ తన సినిమాకు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న దర్శకుల మార్పుపై తాజాగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ రజనీకాంత్- ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం గురించిన ప్రతి వార్తా నిరంతరం ట్రెండింగ్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రజనీ తన సినిమాకు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న దర్శకుల మార్పుపై తాజాగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం నలుగురు దర్శకులు మారిన విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. '' ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు నాలుగో దర్శకుడు. మొదట మేము ఈ ప్రాజెక్ట్ కోసం సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్‌ను అనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత సుందర్ సి.ని లైన్‌లోకి తెచ్చినా ఆయనకు ఇతర కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దీంతో ఆయనే స్వయంగా ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు చెప్పారు! అని రజనీకాంత్ వివరించారు.
అయితే ఈ దర్శకుల మార్పుల ప్రయాణంలో మూడో దర్శకుడిగా వచ్చిన 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తి కథ గురించి రజనీకాంత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అతడు చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉంది. కానీ అది ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ - అణ్వాయుధాల చుట్టూ తిరిగే అత్యంత సున్నితమైన కథాంశం. ఈ సినిమా షూటింగ్‌ను ఆఫ్ఘనిస్తాన్, రష్యా వంటి దేశాలలో ప్లాన్ చేశాం. సబ్జెక్ట్ చాలా బాగున్నా ఇది చాలా సెన్సిటివ్ కావడం ... దీనికి ఎక్కువ సమయం పడుతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను తర్వాత చేద్దామని పక్కన పెట్టాం! అని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. ఈ భారీ సబ్జెక్ట్ ను పక్కన పడిన తర్వాతే 'ఓ మై కడవులే ఫేమ్' అశ్వత్ మరిముత్తు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు రజనీకాంత్ స్పష్టం చేశారు.
రజనీకాంత్ 173వ చిత్రం ఫస్ట్‌లుక్
సూపర్ స్టార్ రజనీకాంత్ వెండితెరపై కనిపిస్తే వచ్చే ఆ హంగామానే వేరు. కమల్ హాసన్ నిర్మాతగా ఆయన 173వ మైలురాయి చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాకు 'ధర్మన్ - ది డెడ్లీ డాక్టర్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ చేతులు కలపడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది.
'ధర్మన్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చాలా క్యూరియాసిటీని పెంచింది. రజనీ లుక్ ని ఇందులో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇందులో రజనీకాంత్‌ను దర్శకుడు ఒక డాక్టర్ అవతారంలో సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారని అర్థమవుతోంది. ఆపరేషన్ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో చేతికి రక్తం అంటిన గ్లౌస్‌తో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని... స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో రజనీకాంత్ ఇచ్చిన ఆ ఎక్స్‌ప్రెషన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే రజనీ పాత్ర చుట్టూ ఏదో పెద్ద మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. తలైవా ఒక రక్షకుడిగా కనిపిస్తారా లేదా దీని వెనుక ఏదైనా బలమైన గతం ఉందా? అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు నెటిజన్లలో మొదలైంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్‌కు చెందిన 'రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా , ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక విభాగానికి వస్తే.. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) అందిస్తున్నారు. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ భారీ యాక్షన్ చిత్రానికి అన్బరివ్ స్టంట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు.