హైప్ తోపాటు రిస్క్ కూడా.. ఓపెన్ ఛాలెంజెస్ ఎందుకో?

సినిమా అనేది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించే ఒక సాధనం అయినప్పటికీ.. ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించడం అంత సులభం కావడం లేదు.;

Update: 2025-10-29 11:42 GMT

సినిమా అనేది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించే ఒక సాధనం అయినప్పటికీ.. ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించడం అంత సులభం కావడం లేదు. సినీ ప్రియులు మైండ్ సెట్ ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. కంటెంట్ ఉంటేనే రేంజ్ తో సంబంధం లేకుండా సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు.

దీంతో ఆడియన్స్ లో ఆసక్తి రేపడానికి.. వారి దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి సినిమాల మేకర్స్ నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ప్రమోషన్స్. వాటి ద్వారా సినిమాలపై మూవీ లవర్స్ లో బజ్ క్రియేట్ చేయడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. అందుకు గాను పలు ఈవెంట్స్ నిర్వహించి స్పీచులు ఇస్తూ సందడి చేస్తున్నారు.

ఆ సమయంలో కొంతకాలంగా ఓపెన్ చాలెంజ్ ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ లో ప్రేక్షకులకు ఓపెన్ చాలెంజ్‌లను విసురుతున్నారు నటులు. ఇది ఇప్పుడు ఓ ఫ్యాషన్‌ గా మారిందని చెప్పాలి. నిన్న రాత్రి హైదరాబాద్‌ లో జరిగిన మాస్ జాతర మూవీ ఈవెంట్ వేదికపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలాంటి ప్రకటనే చేశారు.

మాస్ జాతర సినిమాలో రవితేజ తాతయ్యగా నటించిన రాజేంద్రప్రసాద్.. మూవీలో ఏముందో తాను ఇప్పుడే చెప్పనని అన్నారు. ఎందుకంటే సినిమా థియేటర్‌ లోనే చూడాలని చెప్పారు. మూవీ చూసి అంతా షాక్‌ అవకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఆయన ప్రకటనతో అంతా షాక్ అవుతున్నారు.

అంతకుముందు కూడా రాజేంద్రప్రసాద్ చేసిన ఓపెన్ స్టేట్మెంట్ లాంటివి ఈ మధ్య పలువురు నటులు ఇచ్చారు. తాను నిర్మించిన కోర్టు మూవీ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని.. ఆ సినిమా నచ్చకపోతే తన నెక్స్ట్ మూవీ చూడొద్దని అన్నారు. అయితే కోర్టు మూవీ హిట్ అవ్వడంతో ఆయన స్టేట్మెంట్ సేఫ్ అయిపోయింది.

రీసెంట్ గా నటుడు ప్రియదర్శి కూడా మిత్రమండలి మూవీ టైమ్ లో నాని చేసిన ఛాలెంజ్ నే చేశారు. కానీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అందుకోకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాజేంద్రప్రసాద్.. మాస్ జాతర చూసి షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీని ఏకంగా వదిలేస్తానని ప్రకటించారు.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నటులు చేస్తున్న వ్యాఖ్యలు సినిమాపై హైప్ క్రియేట్‌ చేస్తున్నా, రిస్క్ కూడా పెంచుతాయి. నాని సేఫ్ అయినా.. ప్రియదర్శిపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాస్ జాతర కంటెంట్ ఏమైనా తేడా కొడితే రాజేంద్రప్రసాద్ కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పాలి. మరి మాస్ జాతర ఎలా ఉంటుందో చూడాలి.



Tags:    

Similar News