బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ల‌క్ష్యంగా కాల్పుల క‌ల‌క‌లం.. అంత‌ర్జాతీయ ముఠా ప్ర‌మేయంపై ఆరాలు!

ముంబైలో సెల‌బ్రిటీల‌కు ఎప్పుడు ఏ ముప్పు పొంచి ఉందో అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో ముంబై పోలీసులు కంటిమీద కునుకు ప‌ట్ట‌ని స్థితిలో ఉన్నారు.;

Update: 2026-02-01 05:10 GMT

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇంటిపై దుండ‌గుల కాల్పుల ఘ‌ట‌న గ‌తంలో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. బైక్ వ‌చ్చిన దుండ‌గులు స‌ల్మాన్ ఇంటి బాల్క‌నీపైకి నాలుగైదు రౌండ్లు తుపాకీతో కాల్పులు జ‌రిపి ప‌రార‌య్యారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల గురించి తెలిసిందే. గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దీనికి బాధ్య‌త వ‌హించ‌డంతో ముంబై పోలీసులు చాలా హైరానా ప‌డాల్సి వ‌చ్చింది.

ఇప్పుడు అదే త‌ర‌హాలో బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద కాల్పులు జ‌ర‌గ‌డం ముంబైలో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాల్లోకి వెళితే... ఈ ఆదివారం తెల్లవారుజామున సుమారు 12:30 నుండి 1:00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న రోహిత్ శెట్టి నివాసం అయిన శెట్టి టవర్స్ లక్ష్యంగా గుర్తుతెలియని దుండగులు 4 నుండి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే బిల్డింగ్‌లోని ఒక బాల్కనీ గ్లాస్ ప్యానెల్‌కు బుల్లెట్ గుర్తులు కనిపించినట్లు సమాచారం.

ఘటన జరిగిన వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల‌తో పాటు, జుహు పోలీసులు రంగంలోకి దిగారు. రోహిత్ శెట్టి నివాసం చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలం నుండి బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని దాదాపు వంద‌కు పైగా సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. దుండ‌గులు బైక్‌పై వచ్చినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల తరహాలోనే ఇది కూడా ఉండటంతో.. ఇందులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోహిత్ శెట్టి ప్రస్తుతం తన తదుపరి చిత్రం `గోల్‌మాల్ 5` పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఘటనపై ఆయన కుటుంబం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ముంబైలో సెల‌బ్రిటీల‌కు ఎప్పుడు ఏ ముప్పు పొంచి ఉందో అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో ముంబై పోలీసులు కంటిమీద కునుకు ప‌ట్ట‌ని స్థితిలో ఉన్నారు. స‌ల్మాన్ ఖాన్ ఘ‌ట‌న‌, సైఫ్ అలీఖాన్ పై క‌త్తి పోట్ల ఘ‌ట‌న త‌ర్వాత మ‌ళ్లీ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. రోహిత్ శెట్టి స‌ల్మాన్ స్నేహితుడు గ‌నుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇన్వాల్వ్ మెంట్ ఏదైనా ఉందా? అన్న ఆరాలు కూడా తీస్తున్న‌ట్టు తెలిసింది.

Tags:    

Similar News