నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా.. భారీ లాభాలు అందుకుంటున్న టాప్ దర్శకులు వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోనే సుప్రీం. సినిమా బడ్జెట్‌లో సగభాగం హీరో పారితోషికానికే వెళ్లేది. డైరెక్టర్ ఎంత గొప్ప సినిమా తీసినా, హీరో తర్వాతే అతని స్థానం ఉండేది.;
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోనే సుప్రీం. సినిమా బడ్జెట్‌లో సగభాగం హీరో పారితోషికానికే వెళ్లేది. డైరెక్టర్ ఎంత గొప్ప సినిమా తీసినా, హీరో తర్వాతే అతని స్థానం ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. 'కంటెంట్ ఈజ్ కింగ్' అనే రోజులు పోయి, 'డైరెక్టర్ ఈజ్ కింగ్' అనే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డులను బట్టి చూస్తే, స్టార్ హీరోల కంటే స్టార్ డైరెక్టర్లకే మార్కెట్ వేల్యూ ఎక్కువ ఉంది. ఈ మార్పు కేవలం క్రేజ్‌లో మాత్రమే కాదు, వారు తీసుకునే పారితోషికంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడున్న అగ్ర దర్శకులు ఎవరూ కూడా నెలవారీ జీతాల లెక్కనో, లేదా సినిమాకు ఇంత అని ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోవడమో చేయడం లేదు. వీరంతా ఇప్పుడు "ప్రాఫిట్ షేరింగ్" అనే కార్పొరేట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అంటే సినిమా బడ్జెట్, లాభాల్లో వాటా అన్నమాట. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ వంగా వంటి దర్శకులు సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం మానేసి, సినిమా బిజినెస్‌లో 30 నుంచి 40 శాతం వాటాను డిమాండ్ చేస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే లాభాల్లో వాటా తీసుకోవడం వల్ల వారి ఆదాయం వందల కోట్లకు చేరుతోంది. ఒక విధంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా మంచి లాభాలు అందుకుంటున్నారని చెప్పవచ్చు.
ఈ లిస్టులో నెంబర్ వన్ కింగ్ మన జక్కన్నే. 'బాహుబలి', 'RRR' విజయాలతో రాజమౌళి రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' (SSMB29) సినిమా కోసం ఆయన దాదాపు రూ. 200 కోట్లు అందుకోబోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఇది డైరెక్ట్ రెమ్యునరేషన్ కాదు, సినిమా ప్రాఫిట్స్ లో ఆయన వాటా. గ్లోబల్ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసి, బిజినెస్ చేసే సత్తా ఆయనకు ఉంది కాబట్టి, నిర్మాతలకు కూడా ఈ డీల్ లాభదాయకమే.
ఇక తర్వాతి స్థానంలో సంచలనాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు. 'యానిమల్' సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన సందీప్, ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 150 కోట్ల వరకు రాబడుతున్నాడు. ఒక విధంగా అతని సినిమాలకు సహా నిర్మాతగా కూడా ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో చేయబోయే 'స్పిరిట్', రణబీర్‌తో 'యానిమల్ పార్క్' సినిమాలకు ఆయన లాభాల్లో భారీ వాటా తీసుకోబోతున్నాడు. కేవలం రెండు, మూడు సినిమాలతోనే ఇంతటి క్రేజ్ తెచ్చుకోవడం మామూలు విషయం కాదు.
మరోవైపు బాక్సాఫీస్ మాన్స్టర్స్ ప్రశాంత్ నీల్, అట్లీ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. 'కేజీఎఫ్', 'సలార్'తో ప్రశాంత్ నీల్, 'జవాన్'తో అట్లీ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాకు, అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్‌కు భారీ మొత్తంలో డీల్స్ సెట్ చేసుకుంటున్నారు. వీరు సినిమా తీస్తే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం నిర్మాతల్లో ఉండటమే ఇందుకు కారణం.
మన 'లెక్కల మాస్టర్' సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ్ అశ్విన్ కూడా ఈ రేసులో గట్టిగానే ఉన్నారు. ముఖ్యంగా 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్, రామ్ చరణ్ కోసం దాదాపు రూ. 75 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్. అలాగే 'కల్కి'తో గ్లోబల్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎలాగూ నిర్మాత తన మామయ్య కాబట్టి గట్టి ఆదయమే అందుతుందని చెప్పవచ్చు.
త్రివిక్రమ్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ లాభాలు తీసుకుంటున్నారు. సౌత్ డైరెక్టర్ల హవా ఇంతలా ఉంటే, బాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. రాజ్‌కుమార్ హిరాణీ (రూ. 80 కోట్లు), సంజయ్ లీలా భన్సాలీ (రూ. 65 కోట్లు), సిద్ధార్థ్ ఆనంద్ (రూ. 45 కోట్లు) వంటి వారు లిస్టులో ఉన్నప్పటికీ, టాప్ ప్లేస్‌లన్నీ సౌత్ డైరెక్టర్లవే. లెజెండరీ డైరెక్టర్ శంకర్, లోకేష్ కనగరాజ్ కూడా తమ మార్కెట్ స్టామినాను నిలబెట్టుకుంటూ రూ. 50 నుంచి 60 కోట్ల రేంజ్‌లో ఉన్నారు.
మొత్తానికి, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకుడే రియల్ హీరో. కేవలం కథ చెప్పడమే కాదు, సినిమాను బిజినెస్ చేయడంలోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే నిర్మాతలు కూడా వారికి పార్టనర్ షిప్ ఇవ్వడానికి వెనుకాడటం లేదు. రాబోయే రోజుల్లో ఈ 'ప్రాఫిట్ షేరింగ్' మోడల్ మరింత పెరిగే అవకాశం ఉంది.