'దురంధ‌ర్' త‌ర్వాత ఆర్జీవీ బూస్ట్ ఇచ్చిన మూవీ

మరాఠీ చిత్ర పరిశ్రమలో చారిత్రక కథాంశాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.;

Update: 2026-05-02 18:05 GMT

మరాఠీ చిత్ర పరిశ్రమలో చారిత్రక కథాంశాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తాజాగా నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో నటించిన `రాజా శివాజీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. థియేటర్ల వద్ద కనిపిస్తున్న భారీ రద్దీ, ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఉత్కంఠను చూసి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతంలో `దురంధర్ 2` వంటి చిత్రాలకు తనదైన శైలిలో బూస్ట్ ఇచ్చిన వర్మ ఇప్పుడు `రాజా శివాజీ` ఘనవిజయం సాధిస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

వర్మ తన సోషల్ మీడియా పోస్ట్‌లో జెనీలియాకు అభినందనలు తెలియజేస్తూ `రాజా శివాజీ` బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తోందని పేర్కొన్నారు. డైరెక్టర్‌గా - యాక్టర్‌గా రితేష్ థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ జన్మించారా అన్నంతగా రితేష్ తన పాత్రలో ఒదిగిపోయాడు! అంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం విశేషం. దర్శకుడిగా రితేష్ ప్రతిభను, నటుడిగా ఆయన కనబరిచిన పరిణతిని వర్మ ప్రత్యేకంగా కొనియాడారు.

బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే... మే 1న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే తన సత్తా చాటుకుంది. మొత్తం 6,192 షోలతో దేశవ్యాప్తంగా దాదాపు రూ. 11.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే ఇండియాలో రూ. 13.51 కోట్లతో ఈ చిత్రం ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. చారిత్రక నేపథ్యంలో వచ్చే సినిమాలకు సరైన కంటెంట్ తోడైతే ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారో ఈ చిత్ర ఓపెనింగ్స్ నిరూపించాయి.

ఈ సినిమాకు ప్రధానంగా మరాఠీ వెర్షన్ నుండి అద్భుతమైన మద్దతు లభించింది. ప్రాంతీయ భాషలో సుమారు రూ. 8.00 కోట్లు వసూలు చేయడంతో పాటు... 68 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసి రికార్డు సృష్టించింది. అదే సమయంలో హిందీ వెర్షన్ రూ. 3.35 కోట్ల వసూళ్లను రాబట్టింది. హిందీలో ఆక్యుపెన్సీ కొంత తక్కువగా (16 శాతం) ఉన్నా.. సినిమాకు వస్తున్న మౌత్ టాక్ కారణంగా రానున్న‌ రోజుల్లో అక్కడ కూడా వసూళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విమర్శకుల నుండి ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా సాధారణ ప్రేక్షకులు మాత్రం రితేష్ దేశ్‌ముఖ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ధీరోదాత్తమైన పాత్రను పోషించడంలో రితేష్ చూపిన తెగింపు .. ఆయన దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. మిశ్రమ స్పందనలు ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ లో వసూళ్లు రావడం రితేష్ దేశ్‌ముఖ్ సాధించిన అరుదైన విజయంగా చెప్పవచ్చు. అన్ని సినిమాల‌కు వ‌చ్చిన‌ట్టే మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా రాజా శివాజీ ఓపెనింగ్ వ‌సూళ్ల‌ను ఇవేవీ ఆప‌లేక‌పోయాయంటే సినిమాలో విజువ‌ల్ గ్రాండియారిటీ.. స్టోరి నెరేష‌న్.. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌ వ‌ర్క‌వుట్ అయ్యాయ‌నే భావించాలి. త‌న భ‌ర్త‌తో క‌లిసి స్వ‌యంగా ఈ సినిమాని నిర్మించిన జెనీలియా భావోద్వేగ ప్ర‌చారం కూడా ఈ సినిమాకి ప్లస్ అయింద‌ని భావించాలి.

Tags:    

Similar News