నెమ్మదిగా దీపిక ప్లేస్‌ని కబ్జా చేస్తున్న ఆలియా!

కేవలం వెండితెరపైనే కాకుండా.. కార్పొరేట్ బ్రాండ్స్ పబ్లిసిటీ .. కమర్షియల్ ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ దీపిక కంటే ఆలియాకే కార్పొరేట్ సంస్థలు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాయని సమాచారం.

Update: 2026-06-18 01:30 GMT

బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన సమీకరణం చర్చ‌గా మారుతోంది. ఒకప్పుడు పరిశ్రమను ఏలిన దీపికా పదుకొణె స్థానాన్ని ఇప్పుడు నెమ్మదిగా ఆలియా భట్ కబ్జా చేస్తోందనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం వెండితెరపైనే కాకుండా.. కార్పొరేట్ బ్రాండ్స్ పబ్లిసిటీ .. కమర్షియల్ ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ దీపిక కంటే ఆలియాకే కార్పొరేట్ సంస్థలు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాయని సమాచారం. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆలియా వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తోంది.

ఈ చర్చలకు ప్రధాన కారణం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మైథాలజీ ఫ్రాంచైజీ `కల్కి 2898 AD` సీక్వెల్ (కల్కి 2) లోకి ఆలియా భట్ ఎంట్రీ ఇవ్వడమే. మొదటి భాగంలో `సుమతి` పాత్రతో కథకు మూలస్తంభంగా నిలిచిన దీపికా పదుకొణె స్థానంలో సీక్వెల్‌లో ఆలియా కనిపించబోతోందనే గాసిప్పులు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆలియా నేరుగా దీపిక పాత్రను రీప్లేస్ చేయడం లేదు. కథను ఊహించని మలుపు తిప్పే ఒక సరికొత్త, అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆలియా భట్ మెరవనుంది.

ఆలియా భట్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగి... హైదరాబాద్‌లో జరుగుతున్న `కల్కి 2` రెండవ షెడ్యూల్‌లో జాయిన్ అయినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ఈ భామ‌ ఇప్పటికే దాదాపు ఐదు రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సీక్వెల్‌లో ఆలియా పాత్ర పరిధి ఎంత అనే విషయాన్ని మేకర్స్ అత్యంత రహస్యంగా ఉంచారు. మరోవైపు మొదటి భాగంలో గర్భవతిగా కథను నడిపించిన దీపికా పదుకొణె ఎగ్జిట్‌పై క‌థ‌నాలు వెలువ‌డ‌గా..ఆ స్థానంలో సాయి పల్లవి పేరు పరిశీలనలోకి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం `కల్కి 2` మాత్రమే కాకుండా... బాలీవుడ్‌లోని మరో క్రేజీ ప్రాజెక్టులోనూ దీపికా పదుకొణె స్థానంలో ఆలియా భట్‌ను రీప్లేస్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా వివ‌రాలు వెలువ‌డాల్సి ఉంది. టాలీవుడ్ - బాలీవుడ్ కలయికలో వస్తున్న రెండు భారీ పాన్-ఇండియా సినిమాలను కోల్పోవడం దీపిక కెరీర్‌కు పెద్ద మైనస్‌గా మారింది. వరుసగా ప్రాజెక్టులు చేజారుతుండటంతో దీపికా మార్కెట్ గ్రాఫ్ కాస్త తగ్గుముఖం పట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీనికి భిన్నంగా ఆలియా భట్ అటు యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ యాక్షన్ థ్రిల్లర్ `ఆల్ఫా`లో నటిస్తూ పాన్-ఇండియా నాయ‌కిగా నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇదే స‌మ‌యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ `కల్కి 2898 ఏడి` సీక్వెల్ లో అవ‌కాశం త‌న ఇమేజ్ ను మ‌రింత పెంచుతోంది. ఈ చిత్రాన్ని 2027 చివరి నాటికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా... ఈ గ్యాప్‌లోనే ఆలియా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బ్రాండ్స్ -సినిమాల పరంగా దీపికా స్థానాన్ని ఆలియా పూర్తిగా భర్తీ చేస్తోందని అర్థం చేసుకోవ‌చ్చు. దీపిక ప్ర‌స్తుతం టాలీవుడ్ లో `రాకా` లాంటి క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తుండ‌టం ఒక ర‌కంగా త‌న‌కు ఊర‌ట‌.

Tags:    

Similar News