హీరో కాకముందు.. టాయిలెట్లు క్లీన్ చేశా!
గిప్పీ గ్రెవాల్ యువకుడిగా ఉన్నప్పుడు కెనడాకు వలస వెళ్లారు. అక్కడ జీవనం సాగించడం ఆయనకు అంత సులువు కాలేదు.
పంజాబీ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా.. సింగర్‌గా .. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గిప్పీ గ్రెవాల్ ప్రయాణం ఎందరికో ఆదర్శం. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న ఈ స్టార్ హీరో వెనుక ఎవరూ ఊహించని పెద్ద వలస పోరాటం ఉందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో కెనడాలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ..అక్కడ చేసిన చిన్న ఉద్యోగాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గిప్పీ గ్రెవాల్ యువకుడిగా ఉన్నప్పుడు కెనడాకు వలస వెళ్లారు. అక్కడ జీవనం సాగించడం ఆయనకు అంత సులువు కాలేదు.
నిత్యావసర ఖర్చులు, గది అద్దెలు , ఇతర రోజువారీ బిల్లులు చెల్లించడానికి ఆయనకు డబ్బు చాలా అవసరమైంది. దాంతో అక్కడ ఎలాంటి చిన్న పని దొరికినా? చేయడానికి వెనుకాడలేదు. ఆ క్రమంలోనే గ్రీప్పీ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసాడు.అవసరం మేర అక్కడి టాయిలెట్లను శుభ్రం చేసే పనిని కూడా చేశారు. ఆ రోజుల్లో మనుగడ కోసం.. బిల్లులు చెల్లించుకోవడానికే ఆ పనులన్నీ చేయాల్సి వచ్చిందని గిప్పీ గ్రెవాల్ తెలిపారు. కెనడాలో ఉన్నప్పుడు గంటకు 13 డాలర్లు మాత్రమే వేతనంగా లభించేదన్నారు. పరాయి దేశంలో అడుగుపెట్టిన కొత్తలో వచ్చే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, ఆ తక్కువ సంపాదన అయినా సరే తనకు ఎంతో ముఖ్యం అనిపించిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఏ పని కూడా తక్కువ కాదు. కష్టపడి నిజాయితీగా సంపాదించడంలో తప్పు లేదు అనే దృక్పథమే గిప్పీ గ్రెవాల్‌ను ఆ కష్టకాలంలో ముందుకు నడిపించింది. టాయిలెట్లు శుభ్రం చేయడం ..గార్డ్‌గా రాత్రిపూట కాపలా కాయడం పట్ల ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు. కష్టపడే తత్వమే ఎప్పటికైనా గుర్తింపు తెస్తుందని బలంగా నమ్మారు. ఆ రోజుల్లో తాను అనుభవించిన కష్టాలే తనను మానసికంగా దృఢంగా మార్చాయని.. జీవితంలో దేనికైనా సిద్ధపడే క్రమశిక్షణను నేర్పాయని పేర్కొన్నారు. కెనడాలో అంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ సంగీతం .. సినిమా రంగాలపై ఉన్న మక్కువను అస్సలు వదులుకోలేదు. కొంత కాలానికి భారతదేశానికి తిరిగొచ్చి పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
తన అద్భుతమైన గాత్రంతో, నటనతో స్వల్ప కాలంలోనే పంజాబీ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఆల్బమ్‌లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా బాలీవుడ్‌లోనూ నటనతో అలరించారు. గిప్పీ గ్రెవాల్ స్ఫూర్తిదాయక కథనం నెట్టింట వైరల్‌గా మారింది. విదేశాలకు వెళ్లి స్థిరపడాలని, అక్కడ రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని భావించే ఎంతో మంది యువతకు ఆయన జీవితం గొప్ప పాఠం. ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా? మూలాలను మర్చిపోకూడదని గిప్పీ గ్రెవాల్ నిరూపించారు. అంకితభావం ఉంటే ఎలాంటి సామాన్య స్థితి నుండి అయినా? అసాధారణ విజయాలను అందుకోవచ్చని చాటి చెప్పిన ఆయన ప్రయాణం అభినందనీయం.