ప్రాంతీయ బిరుదుల నుండి గ్లోబల్ ఐకాన్ల వైపు: మన హీరోల ఫ్యాన్స్ మారాల్సిన తరుణం!
సినిమా స్క్రిప్ట్‌లు, రాజకీయ లేదా సామాజిక శీర్షికలలో పౌరుషం, వైభవాన్ని ప్రతిబింబించడానికి ఒకప్పుడు ప్రాంతీయ నేపథ్యం ఉన్న బిరుదులను ఎక్కువగా ఉపయోగించేవారు.
సినిమా స్క్రిప్ట్‌లు, రాజకీయ లేదా సామాజిక శీర్షికలలో పౌరుషం, వైభవాన్ని ప్రతిబింబించడానికి ఒకప్పుడు ప్రాంతీయ నేపథ్యం ఉన్న బిరుదులను ఎక్కువగా ఉపయోగించేవారు. `తెలంగాణ ఐకాన్`, `ఆంధ్రా కేసరి`, `మరాఠా యోధ`, `సీమ సింహం` వంటి శీర్షికలు ఒకప్పటి భావజాలానికి అద్దం పట్టేవి. ఇదే కోవలో కళింగ వీరుడు (ఉత్తరాంధ్ర), తెలంగాణ టైగర్, రాయలసీమ రారాజు, ఆంధ్రా అగ్నిపుత్రుడు, గోదావరి గండడు, పల్నాడు పులి, మగధ మార్తాండుడు, డెక్కన్ డైనమైట్, కన్నడ కంఠీరవ, కోస్తా కొమరం వంటి పవర్‌ఫుల్ బిరుదులు కూడా సమాజంలో.. వెండితెరపై బాగా వినపడేవి. అయితే ఇవన్నీ ఒకప్పటి కాలానికి సరిపోయినా మారుతున్న గ్లోబల్ శైలికి తగ్గట్టు కాలంతో పాటు ఈ ఆలోచనా విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేడు ప్రపంచమంతా గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) వైపు అడుగులు వేస్తోంది. ఈ ఓపెన్ మార్కెట్ నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువును అయినా అమ్మొచ్చు లేదా కొనొచ్చు అనేంతగా సరిహద్దులు చెరిగిపోయాయి. సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారు తాము నటించిన సినిమాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయినా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునే వెసులుబాటు ఉంది. అయితే ఇలాంటి గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టేటప్పుడు ప్రాంతీయత అనే సంకుచిత భావన అస్సలు కుదరదు. తాము కూడా ఒక హాలీవుడ్ హీరో లేదా అంతర్జాతీయ స్థాయి నటుడనే విధంగానే తమను తాము ప్రమోట్ చేసుకోవాలి. ఇంతకుముందు మన తెలుగు హీరోలు కేవలం తెలుగు ప్రజలు లేదా తెలంగాణ-ఆంధ్రా పరిధుల వరకే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ముందున్నది అంతా పాన్ ఇండియా.. గ్లోబల్ సినిమా మాత్రమే. టాలీవుడ్ లో ఈ మార్పుకు, విశాలమైన ఆలోచనకు పునాది పడి చాలాకాలమే అయినా.. పరిశ్రమలో ఇంకా గ్లోబల్ మార్కెట్ ని పూర్తిగా అర్థం చేసుకోలేని కొంత ధైన్యం కనిపిస్తూనే ఉంది.
ఈ మార్పుకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది మన హీరోల అభిమానుల ఆలోచనా శైలి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన హీరోల ఫ్యాన్స్ ఇంకా ఆ పాత ప్రాంతీయ తత్వాన్ని వదిలిపెట్టడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తమ అభిమాన హీరోని కీర్తించేందుకు ఈ ప్రాంతీయ తత్వ తెగులును ఇంకా అనుసరిస్తూనే ఉండటం విచారకరం. ఒక రకంగా చెప్పాలంటే తమ హీరోలను జాతీయ, ప్రపంచ స్థాయికి వెళ్లకుండా ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణ ఐకాన్, ఆంధ్రా సింగం, నవ్యాంధ్ర కేసరి, మరాఠా చక్రవర్తి, సీమ సింహం, కన్నడ కంఠీరవ... ఇలాంటి లోకల్ బిరుదులతో తమ హీరోలకు ట్యాగ్‌లు తగిలించి.. వారిని ఒక నిర్దేశిత ప్రాంతానికే పరిమితం చేస్తున్నారనే అపవాదును ఇటీవల హీరోలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మారుతున్న కాలం.. జెన్ -జి ట్రెండ్‌ను అనుసరించి ఇప్పుడు గ్లోబల్ ఐకాన్, యూనివర్శల్ స్టార్, ఐకాన్ స్టార్ లేదా అంతకుమించిన సరికొత్త అంతర్జాతీయ బిరుదల్ని వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ మన హీరోల ఫ్యాన్స్ ఇంకా వెనకబడిన తమ పాత ఆలోచనలను, ప్రాంతీయ అహంకారాన్ని తమ అభిమాన హీరోపైనే రుద్దేస్తున్నారనే ఆందోళన విశ్లేషకుల్లో నెలకొంది. ఒక హీరో ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన వాడు అయి ఉండొచ్చు. అయినా అసలైన కళకు ఎలాంటి ఎల్లలు, హద్దులు లేవు అనే నిజాన్ని అభిమానులు ఇంకా గుర్తించలేకపోతున్నారు. తమ హీరో కేవలం ఒక ప్రాంతానికే కాదు.. ఒక గ్లోబల్ ఐకాన్ అని సగర్వంగా చెప్పుకునేలా ఎదగాలని ఆకాంక్షించాల్సిన తరుణం ఇది.
ప్రస్తుత రోజుల్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ తో పోటీపడుతూ మన మహేష్ బాబు కూడా భారీ అంతర్జాతీయ చిత్రాల్లో నటించగల సత్తా ఉన్నవాడు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఆర్నాల్డ్ లాంటి స్టార్ల తరహాలో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించగలడు. అలాగే ఆర్.ఆర్.ఆర్ యోధుడిగా మెరిసిన రామ్ చరణ్, ఒక హాలీవుడ్ హీరో రేంజులో ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నాడు. అతడు హాలీవుడ్ ఐకాన్లకు అసలేమీ తక్కువ కాదు. `300` సినిమా యోధుడు జెరార్డ్ బట్లర్ లాగా మన ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అప్పీల్ తో ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. ఇక హాలీవుడ్ బీస్ట్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్లతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయగలడు. ఇలాంటి తరుణంలో `అర్జున్ రెడ్డి` చిత్రంతో జాతీయ స్థాయిలో ముద్ర వేసిన విజయ్ దేవరకొండను లోకలైజ్ చేస్తూ.. `తెలంగాణ ఐకాన్` అనో లేదా `తెలంగాణ మెగాస్టార్` అనో బిరుదులు ఇవ్వడం వారిని కిందికి లాగడం కిందే లెక్క. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ఈ క్రమంలో ఇలాంటి హీరోలకు లోకల్ ట్యాగ్ లు తగిలించి కేవలం ఒక చిన్న మార్కెట్ కి మాత్రమే అంటగట్టాలనే ఆలోచన అభిమానులకు తగదు. తమ పరిధిని విస్తరించే కొద్దీ మన లోకల్ హీరోలు కూడా ప్రపంచ ఓపెన్ మార్కెట్లో అందరి మనసుల్ని గెలుచుకోవడం ఖాయం!