పుష్ప 3 ఉన్నట్లేనా? జగ్గూభాయ్ క్లారిటీ ఇచ్చినట్లేనా?
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతిబాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్ చిత్రాలు నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో పాటు బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాయి. అయితే ఆ ఫ్రాంచైజీలో భాగంగా మూడో పార్ట్ ఉంటుందా లేదా అన్న చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది.
పుష్ప 2 విడుదలైన తర్వాత కథ ముగిసినట్లు కనిపించినా, చివర్లో ఇచ్చిన సిగ్నల్స్.. పుష్ప 3పై ఆసక్తి పెంచాయి. దర్శకుడు సుకుమార్ కూడా గతంలో మూడో భాగానికి అవకాశం ఉందని పరోక్షంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే బన్నీ, సుకుమార్ ఇద్దరూ తమ నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పుష్ప 3 ఉందా లేదా అంటూ సినీ ప్రియుల్లో ఇప్పటికే అనేక డౌట్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతిబాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తన అప్ కమింగ్ మూవీ పెద్ది ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన.. పుష్ప ఫ్రాంచైజీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. పుష్ప 2 షూటింగ్ సమయంలో మూడో పార్ట్ కు సంబంధించిన కొన్ని సీన్స్ చిత్రీకరించారని ఆయన తెలిపారు. అయితే సినిమా రన్ టైమ్, స్టోరీ ఫ్లో వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తన పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ రెండో భాగం నుంచి తొలగించినట్లు చెప్పారు.
ఆ ఛేంజెస్ గురించి దర్శకుడు సుకుమార్ స్వయంగా తనకు వివరించారని జగపతిబాబు వెల్లడించారు. అంతేకాకుండా మూడో పార్ట్ లో తన పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని, కొత్త లుక్ తో పాటు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని చెప్పినట్లు వివరించారు. ఆ విషయాన్ని తాను పాజిటివ్ గానే యాక్సెప్ట్ చేశానని, మళ్లీ ఆ పాత్రలో కనిపించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
జగపతిబాబు కామెంట్స్ తో పుష్ప 3 ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టలేదని క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా మూడో పార్ట్ కోసం ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ చేసిన విషయం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆయన రోల్ కు మరింత ప్రాధాన్యం ఉండబోతుందన్న సమాచారం ఆసక్తిని పెంచుతోంది. అయితే పుష్ప 3 త్వరలోనే స్టార్ట్ అవుతుందని మాత్రం ఎవరూ చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ డైరెక్షన్ లో రాకా మూవీ చేస్తున్నారు.
మరోవైపు సుకుమార్ ఇతర స్టార్ హీరోల కోసం ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా జగపతిబాబు కామెంట్స్ పుష్ప 3పై ఉన్న అనుమానాలకు కొంతమేర క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, మూడో భాగం కోసం ప్లాన్స్ కొనసాగుతున్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. దీంతో పుష్ప రాజ్ కథ మరోసారి తెరపైకి రావడం దాదాపు ఖాయమేనని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. కానీ వారు మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.