మూవీ రివ్యూ : పురుషః

కొత్త హీరో పవన్ కళ్యాణ్.. కమెడియన్లు సప్తగిరి.. రాజ్ కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన కామెడీ సినిమా.. పురుషః. ఫన్నీ ప్రోమోలతో కామెడీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

Update: 2026-05-22 04:55 GMT

'పురుషః' మూవీ రివ్యూ

నటీనటులు: పవన్ కళ్యాణ్ - సప్తగిరి- రాజ్ కుమార్ కసిరెడ్డి- రాయంచ కొక్కుర- విషిక- హాసిని సుధీర్‌- పమ్మి సాయి- వీటీవీ గణేష్- వెన్నెల కిషోర్- గ్యాబి రాక్- రాజీవ్ కనకాల- అనంత్ శ్రీరామ్ తదితరులు

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల

నిర్మాతలు: బత్తుల కోటేశ్వరరావు

రచన - దర్శకత్వం: వీరు ఉలవల

కొత్త హీరో పవన్ కళ్యాణ్.. కమెడియన్లు సప్తగిరి.. రాజ్ కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన కామెడీ సినిమా.. పురుషః. ఫన్నీ ప్రోమోలతో కామెడీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గోవింద్ (పవన్ కళ్యాణ్).. సత్తిబాబు (సప్తగిరి).. శ్రీను (రాజ్ కుమార్ కసిరెడ్డి) చిన్నప్పట్నుంచి స్నేహితులు. గోవింద్- కమల (రాయంచ) లది ప్రేమ పెళ్లి. సత్తిబాబు- లక్ష్మి (హాసిని), శ్రీను- గీత (విషిక)లది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి తర్వాత చాలా కుటుంబాల్లో మాదిరే ఈ ముగ్గురూ భార్యలతో గొడవలు పడతారు. తర్వాత ఈ ముగ్గురూ కలిసి తమ మరో చిన్న నాటి మిత్రుడు కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్తారు. అక్కడ కిస్సు డైరీలో ఈ ముగ్గురి గురించి రాసిన విషయాలు చదివి వీళ్ళ భార్యలు షాకవుతారు. తర్వాత ఈ ముగ్గురి భార్యలు తమకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్తారు. ఇంతకీ కిస్సు డైరీలో వీరి గురించి ఏం రాసి ఉంది? దీని వల్ల తలెత్తిన గొడవ ఎంత దూరం వెళ్లింది. వీళ్లకు విడాకులు వచ్చాయా.. లేదా మళ్లీ కలిశారా? అనేది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పెళ్లి వల్ల మగాళ్లు పడే కష్టాలను సరదాగా.. సెటైరిగ్గా చూపించి నవ్వించడం అన్నది దశాబ్దాల నుంచి సేలబుల్ పాయింట్. ఈ నేపథ్యంలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ దగ్గర్నుంచి ‘ఎఫ్-2’ వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్నిసార్లు తీసినా.. కామెడీ వర్కవుట్ అయితే.. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ కూడా కొంచెం తోడైతే ఈ కథలకు ఢోకా ఉండదు. ‘పురుషః’లో బలమైన ఎమోషన్ ఏమీ లేదు కానీ.. కామెడీ వరకు ఒక బాగానే ఎంగేజ్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ వచ్చే కామెడీ సీన్లతో బాగానే కాలక్షేపం చేయగలిగాడు కొత్త దర్శకుడు వీరు ఉలవల. కానీ కొత్తదనం లేని కథ.. ఓవర్ ద టాప్ నరేషన్.. కొన్నిచోట్ల శ్రుతి మించిన కొన్ని కామెడీ సీన్లు.. ఈ చిత్రానికి ప్రతిబంధకాలుగా మారాయి. టైంపాస్ కోసమైతే ‘పురుషః’పై ఒక లుక్కేయొచ్చు.

జబర్దస్త్ కామెడీ బుల్లితెరలను ముంచెత్తాక ప్రేక్షకులను కామెడీ సినిమాలతో థియేటర్లకు రప్పించడం.. రప్పించినా కడుపుబ్బ నవ్వించడం చాలా సమస్యగా మారిపోయిన రోజులివి. ఆర్గానిక్ కామెడీ సిచువేషన్లను క్రియేట్ చేయడం కూడా సవాలుగా మారింది. ఇలాంటి టైంలో ‘పురుషః’ అక్కడక్కడా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. ఇందులో కిస్సు పాత్రలో వెన్నెల కిషోర్ భలేగా నవ్వించాడు. ప్రధాన పాత్రధారులు ముగ్గురిని సూపర్ హీరోలుగా చూపిస్తూ కొంత మేర కామెడీ పండించారు. పాత సినిమాల ఛాయలు కనిపించినా.. భార్యల వల్ల భర్తలు పడే కష్టాల మీద కామెడీని బాగానే నడిపించారు. కానీ కథ చెప్పాల్సిన చోట మాత్రం దర్శకుడు కొంచెం తడబడ్డాడు. భార్యా బాధితుల కష్టాలను రొటీన్ స్టైల్లో చూపించాడు. చెప్పుడు మాటలు విని.. ఏదో చూసి ఏదో ఊహించుకోవడం.. అనుమానం పెనుభూతంగా మారడం.. ఇవన్నీ భార్యాభర్తల మధ్య గొడవలకు ఎలా దారి తీస్తాయి అన్నది సినిమాలో బాగానే చూపించారు.

ఐతే కొన్ని సీన్లు పెద్దగా అనిపించవు . డైరీలో రాసుకున్నవి ప్రతి మనిషి జీవితంలో తెలిసీ తెలియక చేసే చిలిపి పనులే. తమ భర్తల గురించి డైరీలో చదివిన ఇలాంటి పాత విషయాలను పట్టుకుని భార్యలు విడాకుల వరకు వెళ్లడం అతిగా అనిపిస్తుంది. భార్యాభర్తల గొడవలకు సంబంధించిన సీన్లన్నీ అతిగానే తోస్తాయి. ఐతే వెన్నెల కిషోర్.. సప్తగిరి లాంటి సీజన్డ్ కమెడియన్లకు తోడు రాజ్ కుమార్ కసిరెడ్డి ఒక దశ వరకు ‘పురుషః’లో కామెడీ బండిని బాగానే లాక్కురావడంతో ప్రథమార్ధం ఓకే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ 'కిటికీ' ట్రాక్ సినిమాలో హైలైట్. ద్వితీయార్ధం కామెడీ డోస్ తగ్గినా.. కథ పరంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ హీరో ప్రేమకథ క్యూట్ గా బాగున్నా అది కూడా రెగ్యులర్ గా చాలా సినిమాల్లో ఉండేదే. సెకండాఫ్ లో పమ్మిసాయి మీద తీసిన హౌస్ హజ్బెండ్ సీన్ మెచ్చదగింది. అది నవ్విస్తూనే నిజమే కదా అని ఆలోచింపచేస్తుంది. ఆ సన్నివేశాలను మరింత పొడిగించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. భార్యలు భర్తలను పెట్టే కష్టాలను ఫన్నీగా చూపించి.. చివర్లో కొంత ఎమోషనల్ టచ్ ఇవ్వడం.. ఈ తరహా కామెడీ సినిమాల్లో కామనే. ఇందులోనూ అదే చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. ముగింపులో అయినా అయినా భార్యలు తమ తప్పు తెలుసుకొని ఎమోషనల్ అవుతారేమో అనుకుంటే వారి స్పందన అంత బాగా అనిపించదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. అలవాటైన కథే అయినా.. కామెడీ సీన్ల కోసం ‘పురుషః’ను ట్రై చేసి చూడొచ్చు.

నటీనటులు:

పవన్ కళ్యాణ్ కొత్తవాడైనా బాగానే నటించే ప్రయత్నం చేసాడు. కొన్నిచోట్ల హావభావాల కోసం బాగానే కష్టపడ్డాడు. కామెడీ వరకు పర్వాలేదనిపించగా.. ఎమోషనల్ సీన్లలో తన నటన బాగుంది. వెన్నెల కిషోర్.. రాజ్ కుమార్ కసిరెడ్డి.. సప్తగిరి,పమ్మిసాయి నవ్వించారు. ముఖ్యంగా కిషోర్ అయితే ప్రతి సీన్లోనూ గిలిగింతలు పెట్టారు. వీటీవీ గణేష్..  అనంత్ శ్రీరామ్.. పర్వాలేదనిపించారు. రాయంచ.. హాసిని సుధీర్.. విషిక భర్తలని వేధించే భార్యలుగా బాగానే నటించారు. ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథలో గ్యాబి రాక్ అనే బ్రెజిల్ నటి ఓకే అనిపించింది. హరితేజ.. అనైరా గుప్తా అతిథి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. శ్రవణ్ భరద్వాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా కుదరలేదు. పాటలు కూడా యావరేజ్. ఎడిటింగ్ అంత షార్ప్ గా లేదు. చాలా సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ వీరు ఉలవల.. తెలుగు ప్రేక్షకులకు అలవాటైన కథనే తీసుకుని.. ఇప్పటి ట్రెండుకు తగ్గ కామెడీతో బాగా చేసాడు. కొన్ని క్యారెక్టర్లను.. కామెడీ సిచువేషన్లను బాగానే  రాసుకుని తెరపై సరిగానే ప్రెజెంట్ చేసినప్పటికీ.. ఎగుడుదిగుడుగా సాగే కథనం వల్ల సినిమా ఇంపాక్ట్ తగ్గింది.

చివరగా: పురుషః.. కొన్ని నవ్వుల కోసం

రేటింగ్ : 2.5/5

Tags:    

Similar News