ఫ్లాపుల షాక్ ట్రీట్మెంట్.. ఒకే దారిలో ఆ ఐదుగురు!

బాక్సాఫీస్ దగ్గర వరుస దెబ్బలు తగిలినప్పుడు ఎవరికైనా రెండు దారులు కనిపిస్తాయి.

Update: 2026-10-28 02:30 GMT

బాక్సాఫీస్ దగ్గర వరుస దెబ్బలు తగిలినప్పుడు ఎవరికైనా రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి.. తెలిసిన సేఫ్ జోన్ లో ఉంటూ రొటీన్ లవ్ స్టోరీలు చేసుకుంటూ పోవడం. రెండు.. పాత ఇమేజ్ ను పూర్తిగా పక్కనపెట్టి సరికొత్త రూట్ లో రిస్క్ చేయడం. టాలీవుడ్ లో రెండో దారినే ఎంచుకున్నారు కొందరు స్టార్స్. ఆడియన్స్ ఇచ్చిన చేదు ఫలితాలతో గట్టి పాఠాలు నేర్చుకుని, మూస ఫార్ములాలను చెత్తబుట్టలో వేసేశారు. అయితే ఈ రిస్క్ అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వలేదు.

కిరణ్ అబ్బవరం కెరీర్ గ్రాఫే ఇందుకు పెద్ద ఉదాహరణ. పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు చేస్తూ పోవడం వల్ల విపరీతమైన ట్రోలింగ్ బారిన పడ్డాడు. మార్కెట్ చేజారిపోతోందని గ్రహించి, ఏకంగా తన ఉనికినే పణంగా పెట్టి డెబ్బైల నాటి విలేజ్ మిస్టరీ థ్రిల్లర్ 'క'ను తెరపైకి తెచ్చాడు. రొటీన్ చట్రం నుంచి బయటపడి చేసిన ఆ ప్రయోగమే అతనికి బాక్సాఫీస్ దగ్గర కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమాలో కిరణ్ పోస్ట్‌మ్యాన్‌గా కనిపించాడు. కథంతా ప్రధానంగా ఓ గ్రామంలో జరిగే వింత సంఘటనల చుట్టూ తిరుగుతుంది.

అటు నాగ చైతన్య కూడా తన రెగ్యులర్ క్లాస్ ఇమేజ్ ను పక్కనపెట్టి 'తండేల్' కోసం శ్రీకాకుళం మత్స్యకారుడి అవతారమెత్తాడు. బాడీ లాంగ్వేజ్ నుంచి యాస వరకు పూర్తిగా మార్చేసుకుని తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అందుకే తర్వాతి చిత్రం 'వృషకర్మ'లోనూ మరో విభిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు.

ఇదే తరహా ప్రయోగాత్మక బాటలో అఖిల్ కూడా అడుగుపెట్టాడు. భారీ బడ్జెట్లతో చేసిన స్టైలిష్ కమర్షియల్ చిత్రాలు బోల్తా కొట్టడంతో అఖిల్ తన రూట్ మార్చాడు. 'లెనిన్' అనే రా అండ్ రస్టిక్ యాక్షన్ కథను నమ్ముకుని గ్రౌండెడ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని చూశాడు. జూలైలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా అఖిల్ నటనకు ప్రశంసలు దక్కాయి.

విజయ్ దేవరకొండ సైతం సిటీ బాయ్ ఇమేజ్ దాటి 'రణబాలి' లాంటి పీరియాడిక్ పవర్ ఫుల్ డ్రామాతో బరిలోకి దిగాడు. సాధారణ లుక్స్ వదిలేసి మట్టి వాసన ఉండే క్యారెక్టర్ ను ఎంచుకున్నాడు. అయితే అక్టోబర్ 16న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ. కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. విజయ్ ఇలాంటి పాత్రలు కూడా చేయగలడని మరోసారి నిరూపించుకున్నాడు.

సమంత సైతం గ్లామరస్ కమర్షియల్ చట్రం నుంచి బయటకు వచ్చి 'మా ఇంటి బంగారం' లాంటి లేడీ ఓరియెంటెడ్ కథతో సోలోగా బాక్సాఫీస్ ను ఢీకొట్టింది. జూన్ లో విడుదలైన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. కథనంపై మిశ్రమ స్పందన వచ్చినా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సమంత నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.

Tags:    

Similar News