'ఇరుముడి'లో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్.. కెరీర్ జర్నీ ఆసక్తికరం!

తమిళనాడుకు చెందిన ప్రియా భవానీ శంకర్ చదువు పూర్తయిన తర్వాత మొదట టీవీ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించారు.

Update: 2026-08-21 11:25 GMT

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈరోజే థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకంటోంది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్. న్యూస్ రీడర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు స్టార్ హీరోల పక్కన నటిస్తున్న ఈ చిన్నదాని సినీ జర్నీ విశేషాలు చూద్దాం..

న్యూస్ రీడర్ నుంచి సీరియల్ నటిగా..:

తమిళనాడుకు చెందిన ప్రియా భవానీ శంకర్ చదువు పూర్తయిన తర్వాత మొదట టీవీ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. వార్తలు చదువుతూనే తన అందం, స్పష్టమైన మాటలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత 2014లో బుల్లితెరపైకి అడుగుపెట్టి ఓ పాపులర్ సీరియల్ ద్వారా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఇక అలా చిన్న తెరపై సాధించిన క్రేజ్ ఆమెకు వెండితెర అవకాశాలను తెచ్చిపెట్టింది.

సినిమా ఎంట్రీ.. కోలీవుడ్‌లో బిజీ బిజీ:

2017లో వైభవ్ సరసన ‘మేయాద మాన్’ అనే తమిళ సినిమాతో కథానాయికగా ప్రియా శంకర్ సినీ రంగుల ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ.. ‘కడైకుట్టి సింగం’, ‘తిరుచిత్రంబలం’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత తమిళంలో విశాల్, శింబు, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల సరసన అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని బలపరుచుకున్నారు.

తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ.. 'ఇరుముడి'లో కావేరిగా:

తెలుగులో గతంలో ‘కళ్యాణం కమనీయం’, ‘భీమా’ చిత్రాల్లో నటించిన ప్రియా, అక్కినేని నాగచైతన్య హిట్ వెబ్ సిరీస్ ‘దూత’లోనూ కనిపించారు. ఇక ఈరోజే విడుదలైన ‘ఇరుముడి’లో ఆమె ‘కావేరి’ అనే ఎమోషనల్ రోల్‌లో మెప్పించారు. రవితేజతో కలిసి నటించడం చాలా మంచి అనుభవమని, సెట్‌లో ఆయన ఎంతో సహజంగా, ప్రేమగా ఉంటారని ఆమె మురిసిపోయారు. ఈ సినిమా హిట్‌తో తెలుగులో మంచి బ్రేక్ సాధించారు.

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో న్యూస్ యాంకరింగ్ నుంచి వెండితెర వరకు ఎదిగిన ప్రియా భవానీ శంకర్ ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘ధూత 2’ వెబ్ సిరీస్‌తో పాటు తమిళంలో ‘డిమోంటి కాలనీ 3’ చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ‘ఇరుముడి’ సక్సెస్‌తో తెలుగులో కూడా ప్రియా భవానీ శంకర్ వరుస ఆఫర్లు అందుకుంటూ మరింత ముందుకు దూసుకుపోవాలని ఆశిద్దాం..

Tags:    

Similar News