'పుష్ప' రాక ముందే అంగీకరించాను: పృథ్వీరాజ్
ఇదిలా ఉంటే, పృథ్వీరాజ్ నటించిన వారణాసి 2027లో విడుదలవుతుంటే, ఇంతలోనే అతడు నటించిన మలయాళ చిత్రం `విలాయత్ బుద్ధ` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా థియేటర్లలోకి వస్తోంది.;
పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ పేరు ఐదారేళ్ల క్రితం అంతంత మాత్రంగానే వినిపించేది. పదేళ్లుగా అతడు నటించిన మలయాళ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలవుతున్నా, మార్కెట్ పై గ్రిప్ సాధించడంలో అతడు వెనకబడ్డాడు. కానీ ఇటీవల పృథ్వీరాజ్ ఆల్ రౌండర్ నైపుణ్యం కారణంగా అంతా మారిపోయింది. మోహన్ లాల్ లాంటి అగ్ర కథానాయకుడితో `లూసీఫర్` (ఎల్1, ఎల్ 2) ఫ్రాంఛైజీని విజయవంతంగా నడిపించమే కాకుండా దర్శకుడిగా, నటుడిగా పెద్ద సక్సెసయ్యాడు. పృథ్వీరాజ్ తెరకెక్కించిన సినిమాలు తెలుగులోకి రీమేక్ అయి ఆడుతున్నాయి. అటు బాలీవుడ్ లోను నటిస్తూ అక్కడా తన ఇమేజ్ ని పెంచుకుంటున్నాడు పృథ్వీ. ఇప్పుడు అతడు ఏకంగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `వారణాసి`లో విలన్ పాత్రలో నటిస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కుంభ పాత్రలో అతడి లుక్ ని ఇటీవల లాంచ్ చేయగా ప్రశంసలు కురిసాయి.
ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిగిన వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లోను పృథ్వీరాజ్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఇదిలా ఉంటే, పృథ్వీరాజ్ నటించిన వారణాసి 2027లో విడుదలవుతుంటే, ఇంతలోనే అతడు నటించిన మలయాళ చిత్రం `విలాయత్ బుద్ధ` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా థియేటర్లలోకి వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం అడవి నేపథ్యంలో రక్తి కట్టిస్తోంది. కేరళ- మరయూర్‌లోని గంధపు అడవుల నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ట్రైలర్ ఆద్యంతం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం `పుష్ప` టోన్ తో ఆసక్తిని పుట్టిస్తోంది. ప్రతీకారం, శత్రుత్వం, లవ్ ఇలా అన్ని కోణాల్లో కథ రక్తి కట్టిస్తోంది. ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించారు.
సుకుమారన్ ఇందులో డబుల్ మోహనన్ అనే గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో కనిపిస్తున్నడు. మరోవైపు కథానాయికతో సుకుమారన్ ఉత్కంఠభరితమైన ప్రేమకథ కూడా ఆకట్టుకుంది. నువ్వా నేనా? అంటూ కనిపించే రెండు బలమైన శక్తుల మధ్య జరిగే ఘర్షణతో ట్రైలర్ రక్తి కట్టించింది. ఈ సినిమాలో అను మోహన్, రాజశ్రీ నాయర్, తీజయ్ అరుణాచలం కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, అరవింద్ కశ్యప్, రెనాడివ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తాజా ఇంటర్వ్యూలో ఈ ట్రైలర్ చూడగానే మీ పాత్ర పుష్పరాజ్ ని గుర్తు చేస్తోందని జర్నలిస్ట్ ప్రశ్నించగా, పృథ్వీరాజ్ స్పందిస్తూ ``ఇది `పుష్ప` చిత్రం విడుదల కంటే ముందే అంగీకరించిన సినిమా`` అని తెలిపాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను పుష్పరాజ్ తో పోల్చడంతో అతడు ఈ సమాధానం ఇచ్చాడు. ట్రైలర్ కి అద్భుత స్పందన వస్తోంది. జక్కన్న తెరకెక్కించిన `వారణాసి`లో పృథ్వీరాజ్ సుకుమారన్ క్రూరమైన కుంభ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.