విక్రమ్ కు కంబ్యాక్ ఇచ్చేది అతనేనా?
సినీ ఇండస్ట్రీకి రోజుకెంతో మంది కొత్త టాలెంట్ వస్తూ ఉంటారు. వారిలో ఎంతోమంది డైరెక్టర్లుంటారు.;
సినీ ఇండస్ట్రీకి రోజుకెంతో మంది కొత్త టాలెంట్ వస్తూ ఉంటారు. వారిలో ఎంతోమంది డైరెక్టర్లుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే హార్ట్ టచింగ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ ఉంటారు. అలాంటి వారు చేసేది తక్కువ సినిమాలే అయినా వాటితోనే ఎంతోకాలం గుర్తిండిపోతారు. అందుకే అలాంటి వారి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
అలాంటి డైరెక్టర్లలో ఒకరు ప్రేమ్ కుమార్. 2018లో విజయ్ సేతుపతి తో 96 సినిమా చేసిన ఆయన ఆ తర్వాత గతేడాది సత్యం సుందరం సినిమా చేశారు. ఈ రెండు సినిమాలతో ప్రేమ్ కుమార్ ఆడియన్స్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం సుందరం సినిమా వచ్చి ఏడాదవుతున్నా ఇప్పటికీ ఆయన తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసింది లేదు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో ఓ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీర ధీర శూరన్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన తర్వాత విక్రమ్ ప్రస్తుతం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తన 63వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తో సినిమా చేయాలనే ఆలోచనతో ప్రేమ్ కుమార్, అతనికి ఓ కథను చెప్పాడని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం విక్రమ్, ప్రేమ్ కుమార్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ప్రేమ్ సినిమాల తరహా బలమైన ఎమోషన్స్ తో ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ ఆ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడని, అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గత పదేళ్లలో విక్రమ్ సోలో హీరోగా హిట్ అందుకుంది లేదు. వీర ధీర శూరన్2 తో విక్రమ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే ఆ సినిమా కూడా అనుకున్న ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో విక్రమ్, ప్రేమ్ తో కలిసి సినిమా చేస్తే ప్రేమ్ అయినా విక్రమ్ కు మంచి కం బ్యాక్ ఇస్తాడని కోలీవుడ్ ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.