ఇంట్లో చెప్పకుండా హీరో అయ్యాడు.. సాఫ్ట్ వేర్ జీతం వదిలి 25 కోట్లు అందుకుంటున్నాడు!
యూట్యూబ్‌లో లఘు చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న ప్రదీప్ `కోమాలి` చిత్రంతో దర్శకుడిగా మెగా ఎంట్రీ ఇచ్చారు.;
సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాణించడం అంటే అసాధారణమైన విషయం. కానీ ప్రదీప్ రంగనాథన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఒక సాధారణ ఐటీ ఉద్యోగిగా తన కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో `రూ. 100 కోట్ల హ్యాట్రిక్ హీరో`గా కీర్తినందుకుంటున్నారు. సినిమాలపై ఉన్న అపారమైన మక్కువతో స్థిరమైన జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకోవడం అతడి జీవితంలో అతిపెద్ద మలుపుగా నిలిచింది.
ప్రదీప్ తన లక్ష్య సాధన కోసం తీసుకున్న నిర్ణయం ప్రారంభంలో ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఉద్యోగం వదిలేసిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెబితే ఆందోళన చెందుతారని భావించి.. దానిని రహస్యంగా ఉంచారు. రాత్రిపూట ఆఫీసు పని చేస్తున్నట్లు.. నైట్ షిఫ్టుల్లో బిజీగా ఉన్నట్లు ఇంట్లో నటిస్తూ.. ఆ సమయాన్ని సినిమా కథలు రాసుకోవడానికి .. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించడానికి ఉపయోగించుకున్నారు. ఒక మధ్యతరగతి కుర్రాడు తన కలను నిజం చేసుకోవడానికి ఇంట్లో వాళ్లను సైతం `ఫూల్`ని చేయాల్సి రావడం అతడి సినిమా పిచ్చికి నిదర్శనం.
యూట్యూబ్‌లో లఘు చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న ప్రదీప్ `కోమాలి` చిత్రంతో దర్శకుడిగా మెగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అయితే కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా `లవ్ టుడే` చిత్రంతో నటుడిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రేమకథలు ఎలా ఉంటున్నాయనే అంశాన్ని హాస్యంతో జోడించి అతడు చెప్పిన విధానం యువతకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అతడిని ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసింది.
మొదటి సినిమా `లవ్ టుడే` కోసం రూ. 50 లక్షల పారితోషికం అందుకున్న ప్రదీప్ నేడు తన క్రేజ్‌తో ఒక్కో చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగారు. లవ్ టుడే, డ్రాగన్, ఎల్ ఐసి (LIK) వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ సాధించిన హీరోగా రికార్డు సృష్టించారు. కేవలం నటుడిగానే కాకుండా సాంకేతిక అంశాలపై ఉన్న అవగాహనతో తన సినిమాలను నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దడం అతడికి కలిసొచ్చింది. ప్రదీప్ ఎదుగుదల చూస్తుంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా అతడి వెన్నంటి ఉన్నట్లు అనిపిస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ ప్రయాణం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు ఒక గొప్ప పాఠం. లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి.. నేడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న అతడి ప్రస్థానం.. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తోంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తారని ఆశిద్దాం.