స్పిరిట్: మొత్తానికి వారసులు కనిపించారు..

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2025-11-24 04:48 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన 'స్పిరిట్' ఓపెనింగ్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడం, ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ వేడుకలో స్టార్స్ అందరినీ పక్కన పెడితే.. ఓ ఫోటోలో చిరంజీవి పక్కన కనిపించిన ఇద్దరు కుర్రాళ్లు ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తున్నారు.

సాధారణంగా సినిమా ఓపెనింగ్ అంటే హీరో, డైరెక్టర్, గెస్టుల హడావిడి ఉంటుంది. కానీ చిరంజీవి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి దిగిన ఒక ఫోటో బయటకు వచ్చింది. అందులో ఉన్న ఆ ఇద్దరు యువకులు ఎవరో కాదు.. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల వారసులు. ఇన్నాళ్లు కేవలం రూమర్స్ గా వినిపించిన వార్తలకు ఈ ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారారు.

వారెవరో కాదు.. ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు 'రిషి' కాగా, మరొకరు మాస్ మహారాజా రవితేజ కొడుకు 'మహాధన్'. అవును, మీరు విన్నది నిజమే. వీరిద్దరూ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాకు వీరు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నారు. చిరంజీవి పక్కన వీరు నిల్చున్న తీరు చూస్తుంటే, పని పట్ల ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది.

త్రివిక్రమ్ కొడుకు రిషి డైరెక్షన్ వైపు వస్తాడని ముందు నుంచే టాక్ ఉంది. తండ్రి క్లాస్ డైరెక్టర్ అయితే, కొడుకు మాత్రం ఊర మాస్ డైరెక్టర్ వంగా దగ్గర శిష్యరికం చేయడం ఆసక్తికరమైన విషయం. ఇక అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం మహాధన్ ఎంట్రీ. 'రాజా ది గ్రేట్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మహాధన్, నేరుగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ రవితేజ లాగే.. కష్టపడి, గ్రౌండ్ లెవల్ నుంచి పని నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.

ఒక పక్క ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్, మరోపక్క సందీప్ లాంటి టఫ్ మాస్టర్.. ఇలాంటి ప్రాజెక్ట్ తో కెరీర్ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా, ఇలా కష్టపడి పని నేర్చుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. రవితేజ కూడా కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాకే స్టార్ హీరోగా మారారు. ఇప్పుడు మహాధన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాడు. మొత్తానికి 'స్పిరిట్' సినిమా ప్రభాస్ కే కాదు.. ఈ ఇద్దరు వారసులకు కూడా చాలా కీలకం కానుంది. సందీప్ రెడ్డి వంగా స్కూల్ లో పాఠాలు నేర్చుకుంటే, భవిష్యత్తులో వీరు ఎలాంటి సినిమాలు తీస్తారో లేదా ఎలాంటి హీరోలుగా మారుతారో ఊహించవచ్చు.

Tags:    

Similar News