ది రాజాసాబ్.. ఓ గండం కథ!
సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది కాబట్టి, అక్కడ నమ్మకాలకు, సెంటిమెంట్లకు ఉండే విలువ కొంచెం ఎక్కువే.;
సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది కాబట్టి, అక్కడ నమ్మకాలకు, సెంటిమెంట్లకు ఉండే విలువ కొంచెం ఎక్కువే. కథ, కథనం ఎంత బాగున్నా.. టైటిల్, ముహూర్తం, రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలైతే ఫ్యాన్స్ సెంటిమెంట్లు కూడా బలంగా పనిచేస్తాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా విషయంలోనూ ఇలాంటి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టైటిల్ లో చేసిన ఒక చిన్న మార్పు వెనుక పెద్ద కారణమే ఉందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రభాస్ కెరీర్ ను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. R అక్షరంతో మొదలైన సినిమాలేవీ ఆయనకు కలిసి రాలేదు. 'రాఘవేంద్ర', 'రెబల్', 'రాధే శ్యామ్'.. ఇలా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాలనే ఇచ్చాయి. దీంతో ప్రభాస్ కు 'ఆర్' అక్షరం అచ్చిరాదనే ఒక బలమైన సెంటిమెంట్ ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో నాటుకుపోయింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'రాజా సాబ్' అనే టైటిల్ అనుకున్నప్పుడు, మళ్ళీ అదే భయం అందరినీ వెంటాడింది.
సరిగ్గా ఇక్కడే మేకర్స్ తమ తెలివిని ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. టైటిల్ ను కేవలం 'రాజా సాబ్' అని ఉంచకుండా, దానికి ముందు "ది" (The) అనే పదాన్ని చేర్చి "ది రాజా సాబ్" గా మార్చారు. చూడటానికి ఇది చిన్న మార్పే అయినా, సెంటిమెంట్ పరంగా ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు సినిమా పేరు T తో మొదలవుతుంది కానీ R తో కాదు. ఈ చిన్న ట్రిక్ తో ఆ పాత సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా కనిపిస్తోంది.
నిజానికి ప్రభాస్ కు ఇలాంటి సెంటిమెంట్లపై పెద్దగా నమ్మకం ఉండదు. ఆయన ఎప్పుడూ కంటెంట్ ను మాత్రమే నమ్ముతారు. కానీ నిర్మాతలు, దర్శకులు అలా ఉండలేరు కదా. వందల కోట్ల పెట్టుబడి ఉన్నప్పుడు, చిన్న రిస్క్ తీసుకోవడానికి కూడా వారు ఇష్టపడరు. పైగా సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి, టైటిల్ అనౌన్స్ చేయగానే "మళ్ళీ ఆర్ సెంటిమెంట్, ప్లాప్ ఖాయం" అంటూ ట్రోలింగ్ మొదలైపోతుంది. ఆ నెగిటివ్ బజ్ సినిమా బిజినెస్ ను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
అందుకే ఆ ఆన్ లైన్ ట్రోలింగ్ కు చెక్ పెట్టడానికే మేకర్స్ ఈ "ది" అనే సేఫ్ గేమ్ ఆడారని టాక్ వస్తోంది. ఫ్యాన్స్ ను కూడా సైకలాజికల్ గా సేఫ్ జోన్ లో ఉంచడానికి ఈ నిర్ణయం పనికొస్తుంది. పేరులో ఏముంది, టైటిల్ ఏదైనా కంటెంట్ బాగుంటే ఆడేస్తుంది. కానీ రిలీజ్ కు ముందు వచ్చే ఇలాంటి నెగిటివ్ ప్రచారాన్ని ఆపడానికి ఇలాంటి సెంటిమెంట్ బ్రేకులు తప్పనిసరి.
ఏదేమైనా 'ది రాజా సాబ్' టైటిల్ వెనుక ఇంత పెద్ద వ్యూహం ఉందా అనిపిస్తోంది. మారుతి మార్క్ హారర్ కామెడీకి, ప్రభాస్ వింటేజ్ లుక్స్ తోడైతే ఈ సెంటిమెంట్లు అన్నీ పటాపంచలు అవ్వడం ఖాయం. అక్షరం ఏదైనా, విజయం మాత్రం ప్రభాస్ దే అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ఆ పాత రికార్డులను, సెంటిమెంట్లను ఎంతవరకు బ్రేక్ చేస్తుందో చూడాలి.