మొన్న రామ.. నిన్న కర్ణ.. నేడు రుద్ర
దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టింట తెగ సందడి చేసున్నారు ప్రభాస్ అభిమానులు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే జాన్ నెలతో డార్లింగ్ కు స్పెషల్ బాండ్ ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ మంత్ లో మూడేళ్లుగా తన సినిమాలతో థియేటర్ లో సందడి చేస్తున్నారు ప్రభాస్. 2023లో ఆది పురుష్ తో, 2024లో కల్కి 2898 ఏడీతో, 2025లో కన్నప్పతో వచ్చారు.
అక్కడ ఇంకో విషయమేమిటంటే.. మూడు సినిమాలు కూడా మైథలాజికల్ జోనర్ లో వచ్చినవే. ప్రభాస్ పోషించిన రోల్స్.. పురాణ నేపథ్యంతో ఉండటం విశేషం. ఆదిపురుష్ రాముడిగా కనిపించిన ప్రభాస్.. కల్కి 2898 ఏడీలో కర్ణుడిగా సందడి చేశారు. ఇప్పుడు కన్నప్పలో రుద్ర క్యారెక్టర్ లో మెప్పించారు. క్యామియో రోల్ పోషించినా అదరగొట్టారు.
దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టింట తెగ సందడి చేసున్నారు ప్రభాస్ అభిమానులు. మూడు రోల్స్ కు సంబంధించిన లుక్స్ ను వైరల్ చేస్తున్నారు. అయితే మూడు చిత్రాల్లో ఆది పురుష్ డిజాస్టర్ గా మారినా.. కల్కి 2898 ఏడీతో పాటు కన్నప్ప చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.
కాగా ఆ సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ రాముడి రోల్ లో తెరకెక్కిన ఆదిపురుష్ కు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన ఆ సినిమా 2023 జూన్ 16వ తేదీన రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.
ఆ తర్వాత గత ఏడాది జూన్ 27వ తేదీన కల్కి 2898 ఏడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితర ముఖ్య పాత్రలు పోషించారు. క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించి ఆకట్టుకున్నారు. సీక్వెల్ లో ఆయన రోల్ కీలకంగా ఉండనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ఇప్పుడు తాజాగా కన్నప్పలో రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ ఆద్యంతం మెప్పించారు. భక్త కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ సినిమాకు మెయిన్ పాజిటివ్ ఎలిమెంట్ గా నిలిచారు. ఆయన తప్ప ఎవరూ ఆ రోల్ కు సెట్ అవ్వరనేలా నటించారు. శుక్రవారం రిలీజ్ అయిన కన్నప్ప.. అన్ని సెంటర్స్ లో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.