అనిరుధ్.. ప్రభాస్.. ఎందుకు సెట్టవ్వట్లే?
ప్రభాస్.. పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ లను పెద్దగా రిపీట్ చేయలేదు.
ప్రభాస్.. పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ లను పెద్దగా రిపీట్ చేయలేదు. మంచి గుర్తింపు ఉన్నటువంటి కొత్త కాంబినేషన్స్ కుదిరాయి. కానీ ఇప్పటివరకు అనిరుధ్ రవిచందర్ మాత్రం ప్రభాస్ సినిమాకు సంగీత దర్శకుడిగా రాలేదు. ప్రస్తుతం అనిరుధ్‌కు ఉన్న డిమాండ్, ప్రభాస్ మార్కెట్ చూస్తే ఈ కాంబో ఇంకా సెట్ కాకపోవడం కొంచెం ఆశ్చర్యమే.
బాహుబలి తర్వాత లెక్క చూస్తే ఇంకా క్లియర్‌గా ఉంటుంది. సాహోలో పాటలకు వేర్వేరు కంపోజర్స్ పని చేయగా గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. రాధేశ్యామ్ తెలుగు ఆల్బమ్‌ను జస్టిన్ ప్రభాకరన్ చేశాడు. ఆదిపురుష్‌కు అజయ్ - అతుల్, సచేత్ - పరంపర పని చేశారు. సలార్‌కు రవి బస్రూర్, కల్కి 2898 ఏడీకి సంతోష్ నారాయణన్ వచ్చారు. ఈ ఏడాది వచ్చిన ది రాజాసాబ్‌తో తమన్ కూడా ప్రభాస్‌తో ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో పని చేశాడు.
ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో కూడా అదే పరిస్థితి. హను రాఘవపూడి ఫౌజీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌కు హర్షవర్ధన్ రామేశ్వర్ ఉన్నాడు. సలార్ 2లో రవి బస్రూర్ కొనసాగనున్నాడు. అంటే ప్రభాస్ దగ్గర వరుసగా భారీ సినిమాలు ఉన్నా అనిరుధ్ పేరు మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌కూ ప్రధాన సంగీత దర్శకుడిగా లాక్ కాలేదు.
అనిరుధ్ బిజీగా ఉండటం ఒక కారణం కావచ్చు. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్, రజినీకాంత్ జైలర్ 2, ధర్మన్ లాంటి పెద్ద సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయి. తెలుగులో కూడా దేవర తర్వాత వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రభాస్ స్థాయి ప్రాజెక్ట్ వస్తే బిజీ షెడ్యూల్ ఒక్కటే అడ్డంకి అవుతుందని చెప్పడం కష్టం. స్టార్ హీరోల సినిమాలను అనిరుధ్ వరుసగా చేస్తున్న ట్రాక్ చూస్తే, సరైన దర్శకుడు సినిమా కాంబినేషన్ కుదరడమే ఇక్కడ అసలు విషయం అనిపిస్తోంది.
ఇద్దరి మధ్య అసలు కనెక్షన్ లేదని కూడా చెప్పలేం. రాధేశ్యామ్‌లో సాంచారి పాటను అనిరుధ్ పాడాడు. ఆ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఇచ్చాడు. అంటే ప్రభాస్ సినిమాతో అనిరుధ్ పేరు ఒకసారి కలిసింది కానీ కంపోజర్‌గా మాత్రం కాదు. మరోవైపు ఎన్టీఆర్‌కు దేవర, రజినీకాంత్‌కు జైలర్, షారుక్ ఖాన్‌కు జవాన్ లాంటి సినిమాల్లో స్టార్ ఇమేజ్‌కు సరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలడని అనిరుధ్ ఇప్పటికే చూపించాడు.
ఇప్పుడు ప్రభాస్ లైనప్‌లో ఫౌజీ, స్పిరిట్ తర్వాత కూడా కల్కి 2, సలార్ 2తో పాటు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే లాక్ అయిన సినిమాల్లో కాంబో కుదరకపోయినా, తర్వాతి సినిమాల్లో అవకాశం లేకపోలేదు. ప్రభాస్ సినిమాకు ఇప్పుడు పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పెద్ద మార్కెటింగ్ పాయింట్‌గా మారుతోంది. ఆ జోన్‌లో అనిరుధ్ బలం తెలిసిందే. అందుకే ఇద్దరూ ఎప్పుడు కలుస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.