ప్రభాస్ తో మళ్ళీ కుదరాలి అంటే...

ప్రభాస్ ఒక దర్శకుడితో సినిమా చేశాడంటే తర్వాత మళ్లీ కలవడం కొత్త కాదు. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో ‘బాహుబలి’ చేశాడు.

Update: 2026-08-20 13:30 GMT

ప్రభాస్ ఒక దర్శకుడితో సినిమా చేశాడంటే తర్వాత మళ్లీ కలవడం కొత్త కాదు. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో ‘బాహుబలి’ చేశాడు. ఆ సినిమా మొదలయ్యాక రెండో భాగం కోసం కూడా ఏళ్ల పాటు అదే టీమ్‌తో ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ లైనప్ చూస్తే ఒక పార్ట్ 2 అనౌన్స్ అవ్వడం కంటే, దానికి డేట్స్ దొరకడమే కష్టంగా మారింది. మొదటి సినిమా హిట్ అయినా తర్వాతి సినిమా వెంటనే మొదలవుతుందనే లెక్క లేదు.

‘సలార్’ మంచి రిజల్ట్ ఇచ్చింది. ‘శౌర్యాంగ పర్వం’ కథ కూడా తెలియాల్సి ఉంది. అయినా రెండో భాగం వెంటనే సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రభాస్ వరుస సినిమాలు, ప్రశాంత్ నీల్ కమిట్‌మెంట్స్‌తో గ్యాప్ పెరిగింది. ఇప్పుడు మళ్లీ పార్ట్ 2 మీద పని జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే హిట్ పడింది కాబట్టి వెంటనే సీక్వెల్‌కి వెళ్లిపోతారని చెప్పలేం. ఇద్దరి డేట్స్ కూడా కుదరాలి. మధ్యలో మరో సినిమా వచ్చి పడితే లెక్క మళ్లీ మారిపోతుంది.

‘కల్కి 2898 ఏడీ’ దగ్గర మాత్రం రెండో భాగం మొదట నుంచే కథలో ఉంది. బాక్సాఫీస్ దగ్గర కూడా పెద్ద రిజల్ట్ రావడంతో నాగ్ అశ్విన్ పార్ట్ 2 పనులు కొనసాగిస్తున్నాడు. ప్రభాస్ బిజీగా ఉన్నా ఈ సినిమాకు మాత్రం లైనప్‌లో చోటు ఉంది. మరోవైపు ‘ది రాజా సాబ్’ చివర్లో కూడా రెండో భాగానికి హింట్ ఇచ్చారు. కానీ సినిమా ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఆ సీక్వెల్ గురించి ఇప్పుడు పెద్దగా మాట వినిపించడం లేదు.

ఇప్పుడు హను రాఘవపూడి దగ్గర కూడా రెండో సినిమా మాట మొదలైంది. ‘ఫౌజీ’ సెట్స్‌లో హను వర్కింగ్ స్టైల్ ప్రభాస్‌కు బాగా నచ్చిందని, ఇద్దరూ మరో సినిమా గురించి మాట్లాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కథకు ప్రీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందట. అలాగే హోంబలే ఫిలిమ్స్ ఓ సినిమాను నిర్మించే అవకాశం ఉందనే టాక్ కూడా ఉంది. అయితే ఇవేవీ ఇప్పటివరకు అఫీషియల్‌గా బయటకు రాలేదు.

హను ప్రభాస్‌తో పీరియడ్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ కటౌట్‌కు యాక్షన్ ఒక్కటే కాకుండా ఎమోషన్ కూడా కరెక్ట్‌గా పడితే హనుకు ఈ సినిమా తర్వాత పెద్ద హీరోల నుంచి ఆఫర్లు రావడం కష్టం కాదు. అసలే పాన్ ఇండియా సినిమాలు హ్యాండిల్ చేయగల దర్శకుల కోసం స్టార్ హీరోలు కూడా చూస్తున్నారు. ఒక హిట్ పడితే హను వెంటనే బిజీ కావచ్చు.

అందుకే ‘ఫౌజీ’ హిట్ అయితే హనుతో మళ్లీ సినిమా చేయాలనే మాటను ప్రభాస్ ఎంత త్వరగా ముందుకు తీసుకెళ్తాడన్నది చూడాలి. ప్రీక్వెల్‌కు కథలో నిజంగా అంత స్పేస్ ఉందా, లేక మరో కొత్త సినిమా చేస్తారా అన్నది కూడా అప్పుడే తేలుతుంది. ‘సలార్’లా హిట్ అయినా గ్యాప్ వస్తుందా, ‘కల్కి’లా వెంటనే లైన్లోకి వస్తుందా అన్నది రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది. ప్రభాస్‌తో మళ్లీ కుదరాలి అంటే మొదటి సినిమా నచ్చడం మాత్రమే కాదు.. దానికి తర్వాతి డేట్స్ కూడా దొరకాలి.

Tags:    

Similar News