అనకాపల్లి మూవీ.. నిర్మాత నుంచే కావలసినంత బజ్
‘అనకాపల్లి’ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ ముందు నార్మల్ గా హీరో, హీరోయిన్, ట్రైలర్, పాటలు సినిమాకు బజ్ తెస్తాయి.
‘అనకాపల్లి’ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ ముందు నార్మల్ గా హీరో, హీరోయిన్, ట్రైలర్, పాటలు సినిమాకు బజ్ తెస్తాయి. కానీ ఈ సినిమాకు మాత్రం నిర్మాత కండ్రేగుల నాయుడు బ్యాక్‌స్టోరీనే మరో ప్రమోషన్ పాయింట్‌గా మారుతోంది. సినిమా కంటెంట్ ఒక వైపు ఉండగా, ఆయన చెప్పిన ఫ్లాష్ బ్యాక్ రియల్ లైఫ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్‌కు తాను పెద్ద అభిమాని అని నాయుడు క్లారిటీ ఇచ్చారు. ‘మిర్చి’ సినిమా చూడటానికి ఒకసారి కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లినప్పుడు టికెట్లు దొరకలేదట. షోలు హౌస్‌ఫుల్ కావడంతో ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్లలేకపోయారని ఆయన చెప్పుకున్నారు. అప్పట్లో సాధారణ ప్రేక్షకుడిగా ఎదురైన ఆ అనుభవాన్ని మాత్రం అక్కడితో వదిలేయలేదు. తర్వాత అదే థియేటర్‌ను కొనుగోలు చేసే స్థాయికి వెళ్లడం ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు అదే థియేటర్‌లో ఆయన నిర్మించిన ‘అనకాపల్లి’ కూడా ఆడబోతోంది. ఒకప్పుడు ప్రభాస్ సినిమా టికెట్ కోసం వెళ్లిన వ్యక్తి, ఇప్పుడు తన సొంత సినిమాను అదే స్క్రీన్‌పై రిలీజ్ చేసే స్థాయికి రావడం సహజంగానే జనాలకు కనెక్ట్ అవుతోంది. ఈ ఒక్క ఫ్లాష్‌బ్యాక్ వల్లే నిర్మాత పేరు కూడా సినిమా ప్రమోషన్‌లో భాగమైపోయింది.
నాయుడు జర్నీలో ‘భగీరథ’ సినిమా ఇన్‌స్పిరేషన్ కూడా ఉంది. ఆ సినిమాలో హీరో ఎదిగే ట్రాక్ తనను బాగా ప్రభావితం చేసిందని ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. తర్వాత రియల్ ఎస్టేట్‌లోకి వెళ్లి అనకాపల్లి ప్రాంతంలో తనకంటూ స్థానం తెచ్చుకున్నారు. అక్కడి ప్రజల సహకారం వల్లే తాను ఎదిగానని ఆయన చెప్పడం కూడా ఈ సినిమా పేరుతో ఉన్న కనెక్షన్‌ను ఇంకా దగ్గర చేసింది.
ఇక ‘అనకాపల్లి’ కంటెంట్ కూడా అదే ప్రాంతపు బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. రా అండ్ రస్టిక్ టోన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం టీమ్ ప్రమోషన్స్ కూడా వరుసగా చేస్తోంది.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నిర్మాత నాయుడు కథ కూడా మరింత వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఫ్లాష్‌బ్యాక్ వల్ల ‘అనకాపల్లి’ పేరు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ఇప్పుడు ఆ బజ్ థియేటర్ల దగ్గర ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది రిలీజ్ రోజే తెలుస్తుంది.