అప్పట్నుంచి అదే మాటపై ఉన్న డార్లింగ్
హార్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా వాస్తవానికి ఎప్పుడో రిలీజవాల్సింది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ ను పూర్తి చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను చేస్తున్నారు ప్రభాస్. ఇవి రెండు కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ప్రభాస్ లైనప్ లో ఉండగా, వాటిలో అన్నింటికంటే ముందు రాజా సాబ్ రిలీజ్ కానుంది.
షూటింగ్ లేటవడంతో రాజా సాబ్ ఆలస్యం
హార్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా వాస్తవానికి ఎప్పుడో రిలీజవాల్సింది. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవడంతో ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ లో రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు అది జనవరికి షిఫ్ట్ అయింది. రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
రాజా సాబ్ చేస్తూనే ఫౌజీ కూడా!
ప్రస్తుతం రాజా సాబ్ లోని పెండింగ్ సాంగ్స్ షూట్ కోసం గ్రీస్ వెళ్లిన ప్రభాస్ ఆ షూటింగ్ పూర్తయ్యాక తిరిగి ఇండియా రానున్నారు. దీంతో రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తైపోతుంది. ఇక ఫౌజీ విషయానికొస్తే రాజా సాబ్ చేస్తూనే ప్రభాస్ ఈ సినిమాను కూడా చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు హను.
ఆగస్ట్ లో రానున్న ఫౌజీ
ఇదిలా ఉంటే ఫౌజీ షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో 25 రోజుల టాకీ పార్ట్ మరియు ఫైట్ సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని, మిగిలినదంతా పూర్తైపోయిందని అంటున్నారు. అంతేకాదు ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నారట.
2026లో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు
బాహుబలి, సాహో సినిమాల కోసం ఎంతో సమయాన్ని వెచ్చించిన ప్రభాస్, మిగిలిన హీరోల్లాగా వేగంగా సినిమాలు చేయడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్న విషయాన్ని గమనించి, ఇకపై సంవత్సరానికి కనీసం ఒకటి రెండు సినిమాలుండేలా చూసుకుంటానని మాటిచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలందరూ రెండు మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్న ఈ రోజుల్లో ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా అని అందరూ అనుమానపడ్డారు. కానీ ప్రభాస్ మాటిచ్చినప్పటి నుంచి అదే మాటపై ఉండి వీలైనంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. మామూలుగా అయితే ఈ ఇయర్ డార్లింగ్ నుంచి రాజా సాబ్ రావాల్సింది కానీ అది కొంచెం వాయిదా పడటంతో నెక్ట్స్ ఇయర్ జనవరికి షిఫ్ట్ అయింది. దీంతో ఈ ఇయర్ ప్రభాస్ నుంచి ఏ సినిమా రావడం లేదు. కానీ ఈ ఇయర్ గ్యాప్ ను కవర్ చేస్తూ ప్రభాస్ నుంచి వచ్చే ఏడాది రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట.