స్టార్ల కాల్షీట్స్ ను డిస్ట్రబ్ చేస్తున్న డార్లింగ్
ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఒక సినిమా ఆలస్యమైతే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడుతుంది.;
ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ మరెక్కడో జరిగే ఇంకో మూమెంట్ ను డిసైడ్ చేస్తుందని ఓ సినిమాలో డైలాగుంది. ఈ విషయం అక్షరాలా నిజమని చాలా విషయాలు ప్రూవ్ చేశాయి. ఇండస్ట్రీలో సినిమాలు కూడా అంతే. ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఒక సినిమా ఆలస్యమైతే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడుతుంది.
రాజా సాబ్ వల్ల లేటైన ఫౌజీ, స్పిరిట్
అసలు విషయానికొస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో పలు ప్రాజెక్టులున్నాయి. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఓ మూవీ లేటవడంతో ఆ ఎఫెక్ట్ తన లైనప్ లోని మిగిలిన సినిమాలపై పడింది. మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ లేటవడం వల్ల హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజి షూటింగ్ లేటైంది. ఈ రెండింటి వల్ల సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఆలస్యమైంది.
బల్క్ లో కాల్షీట్స్ కోరుతున్న సందీప్
ప్రభాస్ తో కలిసి స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సమ్మర్ నుంచే సందీప్ రెడ్డి వంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలను సమాంతరంగా షూటింగ్ చేస్తున్న ప్రభాస్, స్పిరిట్ సినిమా కోసం తన అన్ని కమిట్‌మెంట్స్ ను పూర్తి చేసుకుని కాల్షీట్స్ మొత్తాన్ని స్పిరిట్ కోసమే కేటాయించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగాకు హామీ ఇచ్చారు. త్వరలోనే స్పిరిట్ షూటింగ్ మొదలవనుంది.
స్పిరిట్ కారణంగా లేటవుతున్న కల్కి2
ఈ కారణంతో కల్కి2 షూటింగ్ లేటవుతుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ కల్కి2 స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా ముగించారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తో ముందుగా ఈ సీక్వెల్ షూటింగ్ ను మొదలుపెడితే తర్వాత ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అవుతారులే అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రభాస్ మరో ఏడాది పాటూ బిజీగా ఉండటంతో కల్కి సీక్వెల్ లేటవుతుంది.
ఆల్రెడీ కల్కి కోసం తన కాల్షీట్స్ ను కేటాయించిన కమల్ హాసన్ ఆ డేట్స్ ను రీసెంట్ గా సైన్ చేసిన తమిళ ప్రాజెక్టులకు కేటాయించగా, అమితాబ్ బచ్చన్ కూడా కల్కి సీక్వెల్ కోసం కేటాయించిన డేట్స్ ను పక్కనపెట్టి మరీ వేరే కమిట్‌మెంట్స్ కు వెళ్లారు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలను పూర్తి చేసి ప్రభాస్ తిరిగి కల్కి సీక్వెల్ కోసం డేట్స్ ను కేటాయించినప్పుడు తిరిగి కమల్, అమితాబ్ డేట్స్ ను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకోవడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కల్కి సీక్వెల్ లేటవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ లోపు మరో సినిమాను తీయాలని చూస్తున్నారట.