ప్రభాస్ ఫైట్లకు ఒక్కో దర్శకుడు ఒక్కో ప్రపంచం
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసినవన్నీ దాదాపుగా యాక్షన్ సినిమాలే. కానీ ఇక్కడ గమనించాల్సిన స్పెషల్ పాయింట్ ఒకటుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసినవన్నీ దాదాపుగా యాక్షన్ సినిమాలే. కానీ ఇక్కడ గమనించాల్సిన స్పెషల్ పాయింట్ ఒకటుంది. ఏ డైరెక్టర్ కూడా డార్లింగ్ ఫైట్లను ఒకే రొటీన్ మాస్ ఫార్మాట్ లో చూపించడం లేదు. రాజమౌళి మహిష్మతి సామ్రాజ్యంలో యుద్ధాలు చేయిస్తే, ప్రశాంత్ నీల్ ఏకంగా ఖాన్సార్ అనే ఒక వైలెంట్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో ఫ్యూచర్ కాశీకి తీసుకెళ్లాడు. ఇప్పుడు హను రాఘవపూడి టర్న్ వచ్చింది.
బాహుబలి రెండు భాగాల్లో ప్రభాస్ చేతిలో కత్తి, విల్లు, వెనక భారీ సైన్యం కనిపించింది. ఒక రాజ్యం కోసం, ప్రజల కోసం ఆ ఫైట్స్ ఎలా ఉంటాయో చూపించారు. ఆ తర్వాత వచ్చిన సాహోలో డైరెక్టర్ సుజీత్ రూట్ మొత్తం మార్చేశాడు. హైస్పీడ్ ఛేజింగ్స్, గన్స్, భారీ కార్లతో యాక్షన్ కు ఒక పక్కా మోడ్రన్ టచ్ ఇచ్చాడు.
సలార్ వచ్చేసరికి స్క్రీన్ మీద టోన్ పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్ నీల్ దేవా క్యారెక్టర్ లో ప్రభాస్ ను ఒక రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో ప్రెజెంట్ చేశాడు. ఖాన్సార్ లో గ్యాంగ్ వార్స్, చేతిలో పెద్ద పెద్ద కత్తులు, తుపాకులతో యాక్షన్ పీక్స్ కు తీసుకెళ్లాడు. ఆ వెంటనే కల్కి 2898 ఏడీ సినిమాతో నాగ్ అశ్విన్ ఇంకో కొత్త డైరెక్షన్ లోకి వెళ్ళిపోయాడు. భైరవగా ప్రభాస్ తో పాటు బుజ్జి వాహనం, భవిష్యత్తులో వాడే ఆయుధాలు, కాశీ నుంచి కాంప్లెక్స్ దాకా ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించాడు. అశ్వత్థామతో చేసిన ఫైట్స్ నుంచి క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ వరకు అంతా పక్కా సైన్స్ ఫిక్షన్ సెటప్ లో నడిచింది.
ఇప్పుడు ఈ లైన్ లోకి హను రాఘవపూడి ఫౌజీ సినిమాతో వస్తున్నాడు. ఈసారి ప్రభాస్ ను బ్రిటిష్ కాలానికి తీసుకెళ్తున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథతో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో డార్లింగ్ ఒక బ్రిటిష్ ఇండియన్ సోల్జర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా వదిలిన పోస్టర్స్ చూస్తే ఒక రెగ్యులర్ హీరో ఎలివేషన్ లా కాకుండా.. యుద్ధం వల్ల వచ్చిన ఒక తిరుగుబాటు లాంటి ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అంటే యాక్షన్ తో పాటే ఆ పాత్ర పడే పెయిన్ ను కూడా ముందుగానే రిజిస్టర్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ చేశారని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అందులో ప్రభాస్ గెటప్ చాలా కొత్తగా ఉంటుందట. ఆయన కెరీర్ లోనే ఆ ఫైట్ ఒక రేంజ్ లో గుర్తుండిపోతుందని మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈసారి హను ఈ పీరియాడిక్ యాక్షన్ కు ఎలాంటి టచ్ ఇస్తాడో చూడాలి.