ర‌ణ్‌వీర్‌ఫై యుద్ధం ప్ర‌క‌టించ‌డం స‌రైన‌దేనా? 'డాన్ 3' వివాదంపై సీనియ‌ర్ న‌టి!

ఈ నేపథ్యంలో.. సీనియర్ నటి .. సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్ రణవీర్ సింగ్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు.

Update: 2026-06-09 11:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ `డాన్ 3` నుండి అర్ధాంతరంగా తప్పుకున్నారనే కారణంతో నిర్మాత ఫిర్యాదు మేర‌కు ఫెడ‌రేష‌న్ అత‌డిపై నిషేధం (బ్యాన్) విధించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. సీనియర్ నటి .. సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్ రణవీర్ సింగ్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రణవీర్‌పై నాన్-కోఆపరేషన్ అంటూ జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఒక మూడవ పక్షం జోక్యం చేసుకుని ఇలా ఏకపక్షంగా యుద్ధం ప్రకటించినట్లు నిషేధం విధించడం విడ్డూరంగా ఉందన్న పూన‌మ్ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రణవీర్ తమ అసోసియేషన్‌ను ఆశ్రయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

ఫ‌ర్హాన్ బ్యాన‌ర్ లో గ‌తంలో గ‌ల్లీబోయ్ స‌హా మ‌రో పెద్ద హిట్ చిత్రంలోను న‌టించిన అనుబంధం ర‌ణ్ వీర్ కి ఉంద‌ని గుర్తు చేసారు.. అతడు ఎవరికీ కావాలని నష్టం చేసే వ్యక్తి కాదని... ఏదైనా బలమైన కారణం వల్లే `డాన్ 3` నుండి తప్పుకుని ఉంటారని పేర్కొన్నారు. సినిమా నుండి తప్పుకున్నందుకు రణవీర్ అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా... దాదాపు 10 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఆఫర్ చేశారని... చాలామంది నటులు అసలు ఆ పని కూడా చేయరని రణవీర్‌ను అభినందించారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు అత‌డు తప్పుకోవడం వల్ల జరిగిన ప్రీ-ప్రొడక్షన్ నష్టానికి గాను ఎక్సెల్ సంస్థ 45 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.

నటీనటులు చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణమని పూనమ్ థిల్లాన్ స్పష్టం చేశారు. ఒకవేళ కథ (స్క్రిప్ట్) నచ్చకపోతే సినిమా నుండి తప్పుకునే పూర్తి హక్కు నటులకు ఉంటుందని పూన‌మ్ వాదించారు. ఎందుకంటే వెండితెరపై కనిపించేది వారేనని.. రేపు సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రేక్షకుల నుండి వచ్చే విమర్శలను, నిందలను నటులే భరించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. రణవీర్ సింగ్ ఇప్పటికే పెద్ద స్టార్ కావడం వల్ల అత‌డికి లీగల్ సపోర్ట్ చూసుకునే ఆర్థిక సామర్థ్యం ఉందని.. అందుకే అత‌డికి సింటా జోక్యం అంతగా అవసరం పడలేదని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో నటీనటులకు పూనమ్ ఒక కీలకమైన హితవు పలికారు. కేవలం స్నేహం కోసం.. మొహమాటానికి పోయి కథ పూర్తిగా వినకుండా ప్రాజెక్టులకు ఓకే చెప్పవద్దని సూచించారు. కేవలం ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో కమిట్ అయి.. ఆ తర్వాత ప్రాక్టికల్‌గా అది కంఫర్ట్ కాదని తెలిసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. సినిమా నుండి తప్పుకోవాలనుకుంటే ప్రారంభ దశలోనే ఆ నిర్ణయం తీసుకుని.. నిర్మాతలకు జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించాలని సూచించారు. కాగా రణవీర్ సింగ్ తరఫున సిఐఎన్‌టిఏఏ ...ఐఎంపిపిఏ వంటి సంస్థలు రంగంలోకి దిగడం, అలాగే రణవీర్ లీగల్ నోటీసులు పంపడంతో ఫెడ‌రేష‌న్ చివరకు దిగొచ్చి అత‌డిపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది.

గత డిసెంబర్‌లో రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న కొన్ని రోజులకే ఆయన `డాన్ 3` నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినిమా బడ్జెట్‌ను.. అలాగే తన రెమ్యూనరేషన్‌ను సగానికి స‌గం తగ్గించడం... ఫైనల్ స్క్రిప్ట్‌పై పూర్తి సంతృప్తి లేకపోవడం.. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్‌తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వల్లే రణవీర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినందుకు పూనమ్ థిల్లాన్ సంతోషం వ్యక్తం చేస్తూ... భవిష్యత్తులో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమక్షంలో ఈ సమస్యను పూర్తిగా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలను కోరారు.

Tags:    

Similar News