తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణమదే
తెలుగు ఆడియన్స్ బుట్ట బొమ్మ అని ముద్దుగా పిలుచుకునే పూజా హెగ్డే ఆఖరిగా తెలుగు సినిమాలో కనిపించింది 2022లో.;
తెలుగు ఆడియన్స్ బుట్ట బొమ్మ అని ముద్దుగా పిలుచుకునే పూజా హెగ్డే ఆఖరిగా తెలుగు సినిమాలో కనిపించింది 2022లో. ఆ తర్వాత పూజా ఏ తెలుగులో సినిమాలోనూ కనిపించింది లేదు. అప్పుడు పూజా నటించిన
సినిమాలన్నీ వరుస ఫ్లాపులవడం, అదే టైమ్ లో పూజా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేయడం, దానికి తోడు తెలుగులో పూజా ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం తో పూజాకు టాలీవుడ్ లో గ్యాప్ వచ్చింది.
అయితే పూజా నుంచి తెలుగులో సినిమాలు రాకపోవడం చాలా పెద్ద చర్చలకే దారి తీసింది. పూజాకు ఓ మూవీ సెట్స్ లో ఇబ్బంది ఎదురైందని కొందరంటే, ఓ హీరోతో వచ్చిన ఇగో క్లాషెస్ వల్లే పూజాకు తెలుగులో ఆఫర్లు రావడం లేదని మరికొందరన్నారు. దానికి తగ్గట్టే పూజా కూడా తెలుగులో కాకుండా తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చింది.
అయితే రీసెంట్ గా తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా తాను తెలుగులో సినిమాలు చేయకపోవడానికి, రెండేళ్లకు పైగా గ్యాప్ రావడానికి గల కారణాలను వివరించింది. గతంలో వరుసపెట్టి సినిమాలు చేయడం వల్ల రిజల్ట్స్ తేడా కొట్టాయని, అందుకే ఇకమీదట జాగ్రత్త పడి మంచి స్క్రిప్ట్స్ ను మాత్రమే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యానని, అందులో భాగంగానే లేటైందని పూజా వెల్లడించింది.
రెగ్యులర్ గా ఉండే కథలు, పాత్రల్లో తాను కనిపించాలనుకోవడం లేదని, ఆడియన్స్ కు ఇక మీదట కొత్త పూజాని పరిచయం చేయాలనుకున్నానని, కొత్తగా ఉండే పాత్రలు తనకు రాలేదని, తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ రాకపోవడం వల్లే తెలుగు సినిమాల్లో నటించలేదని, అది కావాలని తీసుకున్న గ్యాప్ కాదని, అల వైకుంఠపురములో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది అని.. తన విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చింది పూజా.
ఈ సందర్భంగా తాను తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసిన విషయాన్ని కూడా పూజా వెల్లడించింది. తెలుగులో ఓ మంచి లవ్ స్టోరీ చేయబోతున్నానని, మేకర్స్ ఆ సినిమా గురించి అనౌన్స్ చేసేవరకు తానేమీ చెప్పలేనని ఆ సినిమా కచ్ఛితంగా అందరికీ నచ్చుతుందనుకుంటున్నట్టు పూజా తెలిపింది. మొత్తానికి పూజా త్వరలోనే టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని ఆమె మాటలతో తేలిపోయింది.