మూవీ కెరీర్.. పూజ ఒపీనియన్ ఏంటి?
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్ పై వస్తున్న చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్ పై వస్తున్న చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే.. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. అయితే ఇటీవల ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కెరీర్ లో కాస్త స్లో అయ్యారు.
వరుసగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించడంతో, ప్రస్తుతం ఆమె రేసులో వెనుకబడినట్టు చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో, పూజా ఇతర భాషల వైపు దృష్టి మళ్లించారు. హిందీ, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ, తెలుగులో ఆమె కనిపించి చాలా కాలం కావడంతో అభిమానులు మళ్లీ ఎప్పుడు పెద్ద సినిమాతో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తన కెరీర్ పై వస్తున్న వ్యాఖ్యలపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పూజా హెగ్డే.. సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ చాలా కామన్ అని తెలిపారు. ఒక సినిమా హిట్ అయితే మరొకటి ఫ్లాప్ కావడం సహజమేనని చెప్పారు. వాటిని ఈక్వల్ గా స్వీకరించాల్సిందేనని ఆమె అన్నారు. కెరీర్ లో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయని చెప్పిన ఆమె, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడం ముఖ్యమని తెలిపారు.
తాను ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నానని పూజా హెగ్డే వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. అయితే తన పనిపై పూర్తి ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నానని, తెలిపారు. అందుకే ఊహాగానాలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనకు లేదంటూ ఆమె కొంత గట్టిగానే స్పందించారు.
ఇండస్ట్రీలో తన స్థానం గురించి వస్తున్న చర్చలను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పిన పూజా హెగ్డే.. తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. అందుకే మంచి కథలు ఎంచుకుని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నానని చెప్పారు. భవిష్యత్తులో మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
మొత్తానికి కెరీర్ లో వచ్చిన ఒడిదుడుకులను సహజంగా తీసుకుంటూ, మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి పూజా హెగ్డే కృషి చేస్తోందని చెప్పాలి. ఆమె కొత్త సినిమాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. సరైన కథలు, పాత్రలు వస్తే ప్రేక్షకులను మరోసారి మెప్పిస్తానని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.