రాజాసాబ్ నిర్మాణ సంస్థ.. ఇకపై రిస్క్ లేకుండా..
టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు నిర్మించే బ్యానర్లలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి.;
టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు నిర్మించే బ్యానర్లలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కించినా, గత ఏడాది ఈ ప్రొడక్షన్ హౌస్‌కు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో అటు బయ్యర్లు, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ బ్యానర్ సినిమాల విషయంలో కొంత ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఈ గందరగోళం నుంచి బయటపడటానికి మేకర్స్ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ మోడల్‌ను తెరపైకి తెచ్చారు.
కేవలం విడి విడి సినిమాలు కాకుండా, ఫ్రాంచైజీల మీద దృష్టి పెట్టడమే ఈ కొత్త ప్లాన్. అసలు విషయం ఏంటంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు తన లైనప్ మొత్తాన్ని సీక్వెల్స్‌తో నింపేసింది. మిస్టర్ బచ్చన్, ది రాజాసాబ్ అంటూ వరుస డిజాస్టర్స్ చూసిన ఈ సంస్థ ఇప్పుడు రిస్క్ తీలుకోవడం లేదు. కొత్త కథలతో రిస్క్ చేసే కంటే, ఇప్పటికే ఆడియన్స్‌లో గుర్తింపు ఉన్న సినిమాలను ముందుకు తీసుకెళ్లడం వల్ల బిజినెస్ పరంగా సేఫ్ జోన్‌లో ఉండొచ్చని ప్లాన్ చేస్తోంది. దీనివల్ల రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ చూసే అవకాశం ఉంటుంది.
డిస్ట్రిబ్యూటర్లకు కూడా సీక్వెల్స్ అంటే ఒక రకమైన నమ్మకం ఉంటుంది కాబట్టి, అడ్వాన్స్ ల విషయంలో ఇబ్బంది ఉండదు. ఓటీటీ రేట్లు కూడా ఫ్రాంచైజీ సినిమాలకు ప్రీమియం రేంజ్ లో లభిస్తాయి. ఈ క్రమంలోనే పీపుల్ మీడియా నుంచి వరుసగా క్రేజీ సీక్వెల్స్ రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ తో ‘OG 2’ను 2027 ద్వితీయార్థంలో ప్లాన్ చేస్తుండగా, అడివి శేష్ ‘గూఢచారి 2’ షూటింగ్ సగం పూర్తయ్యింది. ఇక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్ 2’ భారీ స్థాయిలో ఉండబోతోంది.
అలాగే తేజ సజ్జాతో ‘జాంబీ రెడ్డి 2’ను 2027 వేసవికి టార్గెట్ చేశారు. ఇలా వేర్వేరు జానర్లలో ఫ్రాంచైజీలను సెట్ చేయడం ద్వారా మార్కెట్ లో మళ్ళీ తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలని ఈ బ్యానర్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు ఫాలో అవుతున్న సినిమాటిక్ యూనివర్స్ ఫార్మాట్ నే పీపుల్ మీడియా కూడా అందిపుచ్చుకుంటోంది. భవిష్యత్తులో ‘జాంబీ రెడ్డి’, ‘మిరాయ్’ వంటి పాత్రల మధ్య లింక్ ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా చేయడం వల్ల ప్రతి సినిమాకు సున్నా నుండి ప్రమోషన్లు మొదలుపెట్టాల్సిన అవసరం ఉండదు. బ్రాండ్ రీకాల్ వాల్యూ వల్ల బయ్యర్లు కూడా ధైర్యంగా ముందుకు వస్తారు. గత సినిమాల నష్టాలను భర్తీ చేసుకుంటూ స్టెబిలిటీ సాధించడానికి సీక్వెల్స్ కంటే మెరుగైన ఆప్షన్ మరొకటి లేదని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇకపై కేవలం అదృష్టాన్ని నమ్ముకుని సినిమాలు తీయకుండా, ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లబోతున్నారు. ప్రతి ప్రాజెక్ట్ ఒక ఫ్రాంచైజీగా ఎదిగితేనే నిర్మాణ సంస్థకు ఆర్థికంగా భద్రత ఉంటుంది. వరుస వైఫల్యాల తర్వాత ఈ బ్యానర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.