ట్రైలర్ టాక్: మళ్లీ మళ్లీ చూడాలనిపించే విజువల్ వండర్ నితీష్ తివారీ 'రామాయణం'

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 4:15 గంటలకు) విడుదల చేశారు.

Update: 2026-07-30 03:47 GMT

ఇది మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే ఒక ట్రైల‌ర్. ఇది భార‌తీయ పుర‌ణేతిహాసానికి సంబంధించిన ఒక అద్భుత‌మైన గాధ‌కు సంబంధించిన ట్రైల‌ర్. హాలీవుడ్ నుంచి ఎన్నో సూప‌ర్ హీరో ఫ్రాంఛైజీ ట్రైల‌ర్ల‌ను చూసిన క‌ళ్లు న‌మ్మ‌లేని ఒక భార‌తీయ అద్భుతం. దీనికి తెర తీసిన దిగ్ధ‌ర్శ‌కుడు నితీష్ తివారీ.

ఇక్క‌డ మార్వ‌ల్ హీరోలు క‌నిపించ‌రు. కేవ‌లం పురాణేతిహాసం రామాయ‌ణంలోని సూప‌ర్ హీరోల క‌థ ఇది. మార్వ‌ల్ హీరోల‌ను మించి మార్వ‌ల‌స్ అనిపించే గ‌గుర్పాటుకు గురి చేసే విన్యాసాల‌ను తెర‌పై చూడొచ్చ‌ని భ‌రోసానిచ్చింది ఈ ట్రైల‌ర్.

భారతీయ పురాణేతిహాసాల్లో అసాధార‌ణ క‌థ‌గా హృద‌యాను ఏల్తున్న `రామాయణం` ఇప్పుడు పెద్ద‌తెర సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్రముఖ దిగ్దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఇప్ప‌టికే భార‌త‌దేశం స‌హా ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఇటీవ‌లి వాయిదా త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుద‌లైంది. ఇప్ప‌టికే ఇది ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ మళ్లీ మళ్లీ చూడాలనేంతగా కట్టిపడేస్తోంది. హాలీవుడ్ నుంచి ఎన్నో సూపర్ హీరో ఫ్రాంచైజీ ట్రైలర్లను చూసిన ప్రేక్షకుల కళ్లకు, ఇది ఒక నమ్మలేని భారతీయ అద్భుతంగా క‌నిపిస్తోంది. ఇక్కడ మార్వెల్ సూపర్ హీరోలు కాకుండా.. మన భారతీయ పురాణేతిహాసంలోని సూప‌ర్ హీరోలు కనిపించడం విశేషం. మార్వెల్ హీరోలను మించిపోయేలా... గూస్‌బంప్స్ తెప్పించే విన్యాసాలతో ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోందని ట్రైలర్ నిరూపించింది.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 4:15 గంటలకు) విడుదల చేశారు. 4 నిమిషాల 9 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రారంభంలోనే లంకాధిపతి రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యశ్ ఎంట్రీ అదిరిపోయింది. ముఖం కప్పుకుని నడుస్తూ `నేనే మీ కొత్త రాజు` అని చెప్పే డైలాగ్.. ఆ తర్వాత `దేవ లోకం.. భూలోకం.. పాతాళ లోకం.. మూడింట్లోనూ ఒక్కడే రాజు`` అంటూ రావణుడు గర్జించే ఘట్టాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. లంక వైభవం, పుష్పక విమానం, రావణుడి శక్తియుక్తులను అత్యంత గ్రాండ్‌గా చూపిస్తూ రావణుడి పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో మొదటి సన్నివేశాల్లోనే స్పష్టం చేశారు.

అధర్మం పెరిగిపోయి.. మంచి-చెడుల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆ ధర్మాన్ని కాపాడేందుకు విష్ణుమూర్తి మానవ రూపంలో శ్రీరాముడిగా జన్మిస్తాడని వివరించే ఘట్టాలు ఎంతో భావోద్వేగంగా సాగాయి. శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ అద్భుతంగా ఒదిగిపోయారు. గుర్రపు స్వారీ చేస్తూ... తండ్రి దశరథుడి (అరుణ్ గోవిల్)తో సమయం గడిపే దృశ్యాలు... అలాగే సీతాదేవిగా సాయి పల్లవి పరిచయం అయ్యే సన్నివేశాలు విజువల్ వండర్‌గా ఉన్నాయి. రాముడు-సీతల కళ్యాణం, ఆ తర్వాత కైకేయి (లారా దత్తా) నిర్ణయం వల్ల రాముడు- సీత- లక్ష్మణులు అడవులకు పయనం కావడం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

పాత్రల విషయానికి వస్తే... ఈ ట్రైల‌ర్ లో మొత్తాన్ని రావ‌ణుడైన య‌ష్ క‌బ‌లించాడు! అంటే అతి శ‌యోక్తి కాదు. అత‌డి పాత్ర‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో ఆవిష్క‌రించ‌డంలో నితీష్ స‌ఫ‌ల‌మ‌య్యాడు. అయితే ప్ర‌శాంత స్వ‌భావంతో శ్రీ‌రాముడి పాత్ర‌ను చాలా టోన్ డౌన్ చేసి ట్రైల‌ర్ లో ఎంతో బ్యాలెన్స్ డ్ గా చూపించారు. శ్రీ‌రాముడి ప‌రాక్ర‌మాన్ని అన‌వ‌స‌ర హైప్ తో ఎక్క‌డా చూపించ‌లేదు. రామ‌-రావ‌ణుల యుద్ధాన్ని గ్రాఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దినా అతిశ‌యోక్తి అనిపించ‌కుండా ప్ర‌తి స‌న్నివేశాన్ని స‌మ‌తూకం వేసి చూపించారు. ఇక‌ సీతాదేవిగా సాయి పల్లవి తనదైన సహజ నటనతో.. ప్రశాంతమైన గంభీరతతో అలరించింది. అంతేకాకుండా ఒక సన్నివేశంలో సీతాదేవి ఆయుధం పట్టుకుని కనిపించడం ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. లక్ష్మణుడిగా రవి దూబే అలరించగా.. రాముడు వనవాసానికి వెళ్తుంటే తండ్రి దశరథుడిగా అరుణ్ గోవిల్ పరుగెత్తే భావోద్వేగ సన్నివేశం గుండెలను పిండేసేలా ఉంది. అలాగే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే సన్నివేశం... రావణుడి చెల్లెలు శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ అంద‌చందాలు- నటన.. వివేక్ ఒబెరాయ్, సౌరభ్ సచ్‌దేవా వంటి ఇతర తారాగణం మెరుపులు ట్రైలర్ ప్రాముఖ్యతను మరింత పెంచాయి.

ఈ విజువల్ వండర్‌కు మరో ప్రధాన బలం సంగీతం. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్- హన్స్ జిమ్మర్ కలిసి అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అయోధ్యా నగర అందాల నుంచి లంకా దహనం వరకు... రాముడు-రావణుల యుద్ధ సన్నివేశాల వరకు విజువల్స్‌కు తగ్గట్లుగా వచ్చిన ఆర్ఆర్ ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇస్తుంది. లంకాధిపతి రావణుడి రాకతో ప్రారంభమై.. ముల్లోకాల సాక్షిగా రావణుడిని అంతం చేస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసే ఘట్టంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. మొత్తానికి నితీష్ తివారీ `రామాయణం` ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

Full View
Tags:    

Similar News