చ‌ర‌ణ్ ప్ర‌తి షాట్ సిక్స‌ర్‌లా ఉంటుంది: జ‌గ‌ప‌తిబాబు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత కోలాహలంగా జరిగింది.

Update: 2026-06-02 04:15 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు జగపతి బాబు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమా గురించి ఆసక్తికర విషయాలను ముచ్చ‌టించారు. విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జగపతి బాబు ఎంతో భావోద్వేగంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను 1962లో బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజినీ దేవి హాస్పిటల్‌లో పుట్టానని... ఇక్కడి ప్రజలతో పాటే పెరిగానని ఆయన సగర్వంగా చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. `పెద్ది` చిత్రం మొత్తం టాలీవుడ్ కి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఒక పెద్ద దిక్కుగా నిలుస్తుందనే బలమైన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకోవడంతో పాటు.. అందరి ఆకలి, దాహం తీర్చే సినిమా ఇదని ప్రశంసించారు. ఈ చిత్రంలో తాను పోషించిన `అప్పలసూరి` పాత్ర తన సుదీర్ఘ కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్‌గా నిలిచిపోతుందని గర్వంగా చెప్పారు. రామ్ చరణ్ కేవలం గొప్ప నటుడే కాకుండా మంచి మనసున్న ఆప్యాయత గల మనిషి అని కొనియాడారు. సినిమాలో చరణ్ చేసిన ప్రతి షాట్ ఒక సిక్సర్‌లా ఉంటుందని... ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, జాన్వీ కపూర్ నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ.. దర్శకుడు బుచ్చిబాబు తనకు ఒక అద్భుతమైన కథ, స్క్రిప్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. `పెద్ది` ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక వేడుకలా ఉంటుందని... ఆ ప్రతి ఫ్రేమ్‌లోనూ రామ్ చరణ్ అంకితభావం.. త‌న పాత్రపై అత‌డు చూపించిన అసాధారణ కమిట్‌మెంట్ స్పష్టంగా కనిపిస్తాయని రత్నవేలు వివరించారు.

ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను ఎంతో పాజిటివ్ ఎనర్జీతో... నిత్యం చిరునవ్వుతో ముందుకు నడిపించిన నిర్మాత సతీష్ కిలారును రత్నవేలు ప్రత్యేకంగా అభినందించారు. అత‌డు మరెన్నో గొప్ప చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షించారు. జూన్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను ప్రేక్షకులు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నట్లు రత్నవేలు స్పష్టం చేశారు.





Tags:    

Similar News